తెలంగాణ ఉద్యమంలో అక్షరంతో పోరాడిన గొప్ప యోధుడు అందెశ్రీ – సీఎం రేవంత్

CM Revanth Reddy Expresses Deep Shock Over Poet Ande Sri's Demise

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత డా. అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అందెశ్రీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రాసిన సమయంలో అందెశ్రీతో జరిపిన సంభాషణలను ఆయన స్మరించుకున్నారు. అందెశ్రీ మృతితో తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది అని వ్యాఖ్యానించారు.

స్వరాష్ట్ర సాధనలో అందెశ్రీ చేసిన కృషి, ఆయన కలం నుంచి వచ్చిన స్ఫూర్తిదాయక గేయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరోవైపు అందెశ్రీ మృతిపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ దశలో అందెశ్రీతో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్, రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో తన రచనలతో, పాటలతో ప్రజల్లో జాతి గౌరవాన్ని నింపారని, ఆయన మరణం రాష్ట్రానికి తీరని నష్టం అని పేర్కొన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అందెశ్రీ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసారు. “ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.” అని ఎక్స్ వేదికగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here