500 రోజుల్లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం – కేటీఆర్‌

BRS Working President KTR Slams CM Revanth Reddy's Rule in Jubilee Hills Bypoll Campaign

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే. తారకరామారావు (కేటీఆర్‌) యూసుఫ్‌గూడలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలనపై, కాంగ్రెస్ అడ్డగోలు హామీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ అభ్యర్థి మాగంటి సునీతమ్మను గెలిపిస్తే తిరిగి కేసీఆర్‌ వస్తారని, కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.

బుల్డోజర్‌ను ఆపాలంటే.. కారు గుర్తుకు ఓటేయాలి:

పదేళ్లలో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసి, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్‌ పాలన కావాలో? ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇళ్లను కూల్చేవారు కావాలో? జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆలోచించి ఓటేయాలి,” అని విజ్ఞప్తి చేశారు. శని, ఆదివారాలు వచ్చాయంటే పేదల ఇళ్లపైకి ‘హైడ్రా బుల్డోజర్‌’ వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్డోజర్‌ను ఆపాలంటే మూడో నంబర్‌పై ఉన్న కారు గుర్తుకు ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఆరు గ్యారెంటీల అమలు ఎక్కడ?:

సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై కేటీఆర్‌ తీవ్ర ఎద్దేవా చేశారు. “గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకే రేవంత్‌రెడ్డి నిధులు ఇవ్వట్లేదు. అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా?” అని ప్రశ్నించారు. “ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, కేసీఆర్‌.. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు,” అని విమర్శించారు. రెండేండ్లలో ఆరు గ్యారెంటీల్లో ఒక మాట కూడా నిలబెట్టుకోని రేవంత్‌రెడ్డి, ఇప్పుడు జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేస్తామంటే ఎవరూ నమ్మబోరని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ వస్తేనే పోలీసులకు న్యాయం జరుగుతుంది:

సినీ కార్మికులను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడుతూ.. “తన పేరు మరిచిపోయారనే కారణంతో సినీనటులను జైలులో పెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డి సొంతమని” దుమ్మెత్తిపోశారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి, ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం బలవంతంగా సన్మానం చేయించుకుంటున్నారని మండిపడ్డారు. తిరిగి కేసీఆర్‌ వస్తేనే పోలీసులకు న్యాయం జరుగుతుందని, వారి వేతనాలు పెరుగుతాయని స్పష్టం చేశారు.

చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలి:

బీఆర్‌ఎస్‌ పాలనలో పెరిగిన భూముల ధరలు, పెట్టుబడులు కాంగ్రెస్ పాలనలో హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల అంశాన్ని ప్రస్తావిస్తూ.. “మాయమాటలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే షాదీముబారక్‌, రంజాన్‌ తోఫా, కేసీఆర్‌ కిట్‌ వంటి స్కీంలను నిలిపివేసి ధోకా చేస్తున్నారని” ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ప్రజలిచ్చే చరిత్రాత్మక తీర్పుతో నవంబర్‌ 14 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి కుర్చీ ఊడటం ఖాయమని జోస్యం చెప్పారు.

జూబ్లీహిల్స్ తీర్పుతో తెలంగాణకు న్యాయం:

జూబ్లీహిల్స్‌లోని నాలుగు లక్షల మంది ఇచ్చే తీర్పుతో తెలంగాణలోని నాలుగుకోట్ల మందికి న్యాయం జరుగుతుందని కేటీఆర్‌ ఉద్ఘాటించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని, నవంబర్ 11న నిర్భయంగా కారు గుర్తుకు ఓటు వేసి సునీతమ్మను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా మరో 500 రోజుల్లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here