సత్తుపల్లి, మధిరలో కొత్తగా 100 పడకల ఆసుపత్రులు నిర్మాణం

100-bedded Hospitals in Sathupally, 100-bedded Hospitals in Sathupally and Madhira, Cabinet Decided to Construct 100-bedded Hospitals in Sathupally, Madhira, Mango News, Telangana Cabinet, Telangana Cabinet 2021, Telangana Cabinet Decided to Construct 100-bedded Hospitals in Sathupally, Telangana Cabinet Decided to Construct 100-bedded Hospitals in Sathupally and Madhira, Telangana Cabinet Key Decisions, Telangana Cabinet Meeting

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం మంగళవారం నాడు ప్రగతి భవన్ లో జరిగింది. సుమారు తొమ్మది గంటల పాటు సుధీర్ఘంగా సాగిన సమావేశంలో పలు అంశాలను చర్చించి, కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్థుతం ఉన్న దవాఖానాలను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యశాఖను ఆదేశించింది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. రేపటినుంచి ప్రారంభించబోతున్న 19 తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఎలర్జీ జబ్బుల పరీక్షలు ట్రీట్ మెంట్ కోసంగా ప్రత్యేక కేంద్రాలను హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట,మహబూబ్ నగర్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్థుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని డయాలసిస్ యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీ, రేడియో థెరపీ కొరకు అవసరమైన మౌలిక వసతులతో, జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని దవాఖానాల్లో అవసరాలకు సరిపడా బ్లడ్ బ్యాంకుల ఆధునీకరించి అవసరమైన మేరకు నూతన బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.

వరంగల్ లో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో, దేశంలోనే అత్యుత్తమంగా వైద్య సేవలందిస్తున్న ఎయిమ్స్ తరహాలో దవఖానాను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎం.డీ హాస్పటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని నియమించుకుని హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్య సేవల్లో భాగం పంచుకునే నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులను, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నిషియన్, డయాలసిస్ టెక్నిషియన్ వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను అవసరమైనంత మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యకళాశాలల్లో అందుబాటులోకి తేవాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.

రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కు సంబంధించిన వైద్య సేవలను మరింతగా పటిష్టపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీ బిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని, అందులో భాగంగా, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రధాన దవాఖాన భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించి వసతులు కల్పించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ ప్రత్యేక భవనంలోనే హై రిస్క్ ప్రసవాలకు ఆవసరమైన గర్భిణీల వైద్యసేవలం కోసం ప్రత్యేక ‘ మెటర్నల్ ఐసీయూ’ లను, నవజాత శిశువుల కోసం ఎస్.ఎన్.సీ.యూ లను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైద్యశాఖ అహర్నిషలు కృషి చేయాలని కెబినెట్ ఆదేశించింది. గర్భం దాల్చిన మూడో నెలనుంచి గర్భిణీలకు సమతుల పౌష్టికాహార కిట్టును అందించాలని నిర్ణయించింది. ఇక రెండో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైన మౌలిక వసతులను, సిబ్బందిని, ఔషదాలను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + eight =