రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ ఫైర్.. ‘హిల్ట్’ పాలసీపై తీవ్ర విమర్శలు

BRS Working President KTR Slams Congress Govt Over New HILT Policy

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హిల్ట్ పాలసీ’ (Hyderabad Industrial Lands Transformation (HILT) Policy)పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించిన ఆయన ఈ పాలసీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించారు.

కేటీఆర్ చేసిన విమర్శలు, కీలక డిమాండ్లు
  • భూముల విలువ: నాడు రాయితీపై పరిశ్రమలకు కేటాయించిన భూముల ధరలు ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా పెరిగాయని కేటీఆర్ తెలిపారు. ఒక్క జీడిమెట్ల ప్రాంతంలోనే రూ. 75 వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయని మాజీ మంత్రి పేర్కొన్నారు.

  • రియల్ ఎస్టేట్ వ్యాపారం: ‘హిల్ట్’ పేరిట ఇక్కడ, ‘ఫ్యూచర్ సిటీ’ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. కోకాపేటలో వందల కోట్లు విలువ చేసే భూమి, జీడిమెట్ల ప్రాంతంలో కోటి రూపాయలు విలువ చేస్తుందనడం ఏంటని ప్రశ్నించారు.

  • ప్రజల ఆస్తిపై కుట్ర: ‘హిల్ట్ పాలసీ’ వెనుక రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం దాగి ఉందని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ‘రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ’ అంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీకి మూటలు పంపడానికి, దోచుకోవడానికే ఈ కుట్ర జరుగుతోందని కేటీఆర్ హెచ్చరించారు.

  • ప్రభుత్వ వైఫల్యం: పేదల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేటీఆర్ విమర్శించారు. రెండేళ్లలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టలేదని, కానీ, పరిశ్రమల భూములను ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, కనీసం శ్మశాన వాటికల కోసం వినియోగించకుండా, రియల్ ఎస్టేట్‌కు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ పోరాటం
  • పోరాట కార్యాచరణ: ఈ భూ కుంభకోణంపై బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో అందరికీ అవగాహన కల్పిస్తామని, సమావేశాలు, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామని, న్యాయస్థానాల్లో పోరాడతామని స్పష్టం చేశారు.

  • పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి: రిజిస్ట్రేషన్ ధరలో 30 శాతం ఇచ్చి ఏమైనా చేసుకోవచ్చనే ప్రభుత్వం ఇస్తున్న ‘ఆషాఢ సేల్ లాంటి ఆఫర్‌ను’ చూసి పారిశ్రామిక వేత్తలు మోసపోవద్దని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చర్యలను వెనక్కు తీసుకుంటామని, చట్టం తీసుకొచ్చి చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

  • డిమాండ్లు: ఈ భూములను ప్రజల కోసం, కార్మికుల కోసం, గ్రీన్ ఇండస్ట్రీస్ పెట్టడం కోసం వినియోగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here