తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana Rising Global Summit CM Revanth Reddy Announces China's Guangdong Model Implementation

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని, 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ఈ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • ఆర్థిక లక్ష్యం: 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేదే తమ ఆశయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందని, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ ఆశయమని సీఎం పేర్కొన్నారు.

  • రాష్ట్ర విభజన: సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశ జనాభాలో కేవలం 2.9 శాతమే ఉన్నప్పటికీ, దేశ ఆదాయంలో తెలంగాణ 5 శాతం వాటాను ఇస్తోందని వివరించారు.

  • రాష్ట్రంలో జోన్ల ఏర్పాటు: ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణను మూడు జోన్లుగా విభజించామని సీఎం తెలిపారు. వాటిని సేవ (Cure), తయారీ (Pure), వ్యవసాయ (Rare) రంగాలకు కేటాయించినట్లు చెప్పారు. ఈ జోన్లను క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ జోన్లుగా పిలుచుకుంటున్నట్లు వివరించారు.

  • ఆదర్శం: తమ లక్ష్యం పెద్దది అయినప్పటికీ, కష్టపడి సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని సీఎం అన్నారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని, అది 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని తెలిపారు.

  • అదేమాదిరిగా ఇక్కడ కూడా గ్వాంగ్‌డాంగ్‌ నమూనాను అమలు చేయదలిచామని చెప్పారు. చైనా, జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్‌ వంటి దేశాలు తమకు ఆదర్శమని పేర్కొన్నారు.

అందరి సహకారంతో తమ లక్ష్యాన్ని అందుకుంటామనే నమ్మకం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కాగా, అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమం తొలిరోజున కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, నోబెల్ ప్రైజ్ విన్నర్ కైలాశ్ సత్యార్థి, నటుడు అక్కినేని నాగార్జున సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here