గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారట. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం వల్ల.. వారికి జాబ్‌చార్ట్ ఉండటం లేదు . దీనివల్ల కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, మరికొందరికి అసలు పనే లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి చంద్రబాబు భావిస్తున్నారు.
మొత్తంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయనుంది. గ్రామ, వార్డు సచివాలయాల సిస్టమ్‌లోని ప్రక్షాళనలో భాగంగా.. రేషనలైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా చిన్న పంచాయతీల్లో విధుల కోసం తక్కువ మంది, పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మందిని అందుబాటులో ఉంచి.. ప్రజలకు సేవలందించేలా ఆలోచిస్తుంది. మొత్తం 1.61 లక్షలమంది కార్యదర్శుల్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోనుంది. ఏపీ వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళల సంరక్షణ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా పరిపాలన, శానిటరీ, ఎడ్యుకేషన్, సంక్షేమ, హెల్త్, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వీఆర్వో, ఏఎన్‌ఎమ్ ఉండేలా ప్రతిపాదించే అవకాశముంది. వారిలోనే ఒకరిని డీడీవోగా నియమించనున్నట్లు తెలుస్తోంది.మిగిలిన కార్యదర్శులను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
గ్రామ,వార్డు సచివాలయాల్లోని కొన్ని పోస్టులను రద్దు చేసి మాతృ శాఖలో విలీనం చేసే అవకాశముందంటున్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్,అగ్రికల్చర్ అండ్ హార్టి కల్చర్ అసిస్టెంట్,విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్లు, పశు సంవర్థక అసిస్టెంట్లు వంటి పోస్టులను కేన్సిల్ చేసి.. క్లస్టర్ విధానంలో మాతృ శాఖలో ఆధీనంలో పని చేయించే అవకాశముందంటున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులను
సైతం.. పంచాయతీ రాజ్ కింద గ్రామ పంచాయతీలకి పరిమితం చేయడానికి ఆలోచిస్తుందని చెబుతున్నారు.
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిస్టమ్‌ను ఏం చేయాలనే అంశంపై ఇప్పుడు కూటమి సర్కార్ సుదీర్ఘంగా కసరత్తులు చేస్తోంది. మొత్తం సచివాలయాలకు అవసరమైన ఐదారుమంది కార్యదర్శులను మాత్రమే అక్కడే ఉంచి మిగిలినవారందరినీ ఆయా మాతృసంస్థలకు పంపించాలని ఆలోచిస్తుంది. ఇలా చేస్తే ఆయా డిపార్టుమెంటులను బలోపేతం చేసినట్లవుతుందని యోచిస్తోంది. ఇలా చేస్తే ప్రజలకు మరింతగా సేవలందించే అవకాశం కలుగుతుంది భావిస్తోంది.
మరోవైపు గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరి పనులు వాళ్లే చేయాలి తప్ప.. గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు చేయడమేంటని .. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల డిపార్టుమెంట్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు చేపట్టడానికి ప్రక్రియ ప్రారంభించిన విషయాన్ని అధికారులు.. ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ల్యాండ్స్‌కు సంబంధించిన రికార్డులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల డిపార్ట్మెంట్ వద్ద ఉం టాయని, అక్కడే రిజిస్ట్రేషన్లు చేస్తే ఆ ప్రక్రియకు విలువ ఉంటుందని చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం భూముల విలువ సవరించడానికి ప్రతిపాదనలో కూడా తప్పుల తడకగా చేసిందని చంద్రబాబు అన్నారు. ఒక నిర్దిష్ట విధానం అనేది లేకుండా భూముల విలువలను ఒక్కోరకంగా సవరిస్తూ పోయారని.. దీంతో మార్కెట్ విలువ పెంపుదల విషయంలో గందరగోళం ఏర్పడిందని అన్నారు. వెంటనే ఆ విధానానికి స్వస్తి చెప్పాలని.. సమగ్రంగా దీనిపై అధ్యయనం చేసి కొత్త మార్కెట్ రేట్ల ప్రతిపాదనను.. తీసుకురావాలంటూ ఆ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.