నేటి నుంచే ఏపీలో వైఎస్ఆర్ నవశకం

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, YSR Navasakam Survey, YSR Navasakam Survey Starts, YSR Navasakam Survey Starts From Today, YSR Navasakam Survey Starts From Today In Andhra Pradesh, YSR Navasakam Survey Starts From Today In AP

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో భాగంగా అర్హులను ఎంపిక చేసేందుకు ‘వైఎస్ఆర్ నవశకం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించనున్నారు. నవంబర్ 20, బుధవారం నాడు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం డిసెంబర్ 20 వరకు కొనసాగనుంది. వివిధ పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం గ్రామ, పట్టణ వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు మండల కార్యాలయ అధికారులందరూ ఈ ఇంటింటి సర్వేలో పాల్గొనబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే విధానం ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా చేపడుతున్నారు. ఈ సర్వే అనంతరం బియ్యం కార్డు, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు, వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలకు, చేపట్టబోయే మరికొన్ని సంక్షేమ పథకాలలో అందరికీ న్యాయం జరిగేలా అర్హతలు, ఎంపిక మార్గదర్శకాలను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం విధివిధానాలు నిర్ణయించి, ఇంటింటి సర్వేలో పాల్గొనే అధికార యంత్రాంగానికి మంగళవారం వరకు వివిధ దశల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న ప్రాంతంలో రోజుకు ఐదు ఇళ్ళు చొప్పున, పట్టణ ప్రాంతాల్లోని వార్డు వాలంటీర్లు రోజుకు పది ఇళ్లలో సర్వే నిర్వహిస్తారు.

సర్వే అనంతరం ఎంపికైన లబ్ధిదారుల ముసాయిదా జాబితాలను ముందుగా ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఎంపిక జాబితాలపై ఎవరైనా స్థానిక ప్రజలకు అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులను పూర్తి అయ్యాక గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామ, వార్డు సభల్లో లబ్ధిదారుల యొక్క తుది జాబితాలకు ఆమోదం తెలుపుతారు. ఎంపికైన లబ్ధిదారుల తుది జాబితాను గ్రామ సచివాలయాల ఏర్పాటు చేసే బోర్డుల్లో శాశ్వతంగా ప్రదర్శనలో ఉంచుతారు. రోజువారీ సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆయా సచివాలయ అధికారులు, మండల అధికారులకు, మున్సిపాలిటీల స్థాయి అధికారులకు చేరవేయాలి, అనంతరం ఆ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. అర్హులైన లబ్ధిదారులకు జనవరి 1, 2020 నుంచి కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు.

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 9 =