ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కాసేపట్లో క్యాబినెట్ సమావేశం ప్రారంభకానుంది. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనుంది. 3 ఉచిత సిలిండర్ల పథకంపై ఈ కేబినెట్‌లో చర్చ సాగనుంది. ముఖ్యంగా వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూలింగ్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పాలసీలపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు.
అదేవిధంగా తిరుమలలో లడ్డూ కల్తీ ఘటన తర్వాత.. పాలకమండలిలో బ్రాహ్మణులుండాలన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. ఈ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, చెత్త పన్ను రద్దు ప్రతిపాదన ఈ సమావేశంలో కీలక చర్చ అంశం కానుంది. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రతను పెంచడం కోసం తీసుకునే కీలక నిర్ణయం కావడంతో, ఇది సామాన్య ప్రజలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఈ కొత్త ఉద్యోగాలు, స్థానిక ప్రభుత్వ విధుల నిర్వహణలో కీలకంగా ఉంటాయి. తద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి బలమైన మద్దతు లభించనుంది.
18న ఎమ్మెల్యేలతో భేటీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ఈనెల 18న ఎమ్మెల్యీలు, ఎమ్మెల్సీలతో సమావేశం అవనున్న సీఎం.. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ప్రభుత్వ విధానాలపై చర్చించనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాలలో ఎమ్మెల్యేల జోక్యం చేసుకోవడంపై కూడా ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపరంగా ఎమ్మెల్యేలతో తొలిసారిగా చంద్రబాబు భేటీ అవుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.