
ఎన్నికలు ముగిసినా.. రాజకీయ దాడుల కొనసాగుతుండడం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా చిత్తూరు, అనంతపురం, కారంపూడి తదితర ప్రాంతాల్లో ఇరు పార్టీల దాడులు, ప్రతిదాడులు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. తాడిపత్రిలో ఓ కళాశాల స్థలంలో వైసీపీ, టీడీపీ టపాసులతో మరీ దాడులు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలతో స్థానిక వాతావరణం వేడెక్కుతోంది. పోలీసులు భారీ బలగాలతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇరువర్గాలను చెదరగొడుతూ.. ఘర్ణణలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటన మరింత కలకలం రేపింది. వైసీపీ నేతలు ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేశారు.
పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర నిన్న జరిగిన ఘటనతో ఇప్పటికీ స్థానిక వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ కూటమి నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పులివర్తి నాని కారు ధ్వంసం, గన్‌మెన్ ధరణికి తీవ్ర గాయాలయ్యాయి. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేసి భయాభ్రాంతకులకు గురిచేశారని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నడవలూరు సర్పంచి గణపతి, రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరుల ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే దాడులకు దిగారని విరుచుకుపడ్డారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ మూకలను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని కూటమి నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. తిరుపతిలో పరిస్థితి అదుపులోనే ఉందని ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు.
అలాగే.. పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. అభ్యర్థులను తిరగొద్దని చెబితే.. తాను వెళ్లిపోయాను.. కానీ తన ప్రత్యర్థి మాత్రం యధేచ్ఛగా తిరిగారన్నారు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమల మర్రి గ్రామాల్లోని ఆరు బూత్‌లలో బూత్ క్యాప్చరింగ్ జరిగిందన్నారు. ఈ ఆరు బూత్‌లలోని పీఓ రిపోర్ట్ కాకుండా వెబ్ కెమెరాలను పరిశీలించాలని కోరారు. ఈ ఆరు బూత్‌లలో రీ-పోలింగ్ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బోండా, బుద్దా వెంకన్న కారుపై దుంగలతో దాడి జరిగిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. జరిగిన మాట వాస్తవమే అని మంత్రి అంగీకరించారు. పోలింగ్ రోజున తెనాలిలో జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు ఏడుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని గొట్టిముక్కల సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY