కొద్ది రోజులుగా మెగా, అల్లు రెండు కుటుంబాల మధ్య నడుస్తున్న వివాదానికి చెక్ పడింది. వివాదానికి కారణమైన బన్నీ.. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పడంతో మెగా అభిమానులు ఖుషీఅవుతున్నారు. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో.. మెగా కుటుంబానిది ప్రత్యేక స్థానం అంటే ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. చిరంజీవి మకుటం లేని మహారాజులా ఎదిగి మెగాస్టార్‌గా వెలగడం వల్ల మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు.
చివరకు అల్లు అర్జున్ కూడా అల్లు రామలింగయ్య మనవడిగా తెరపైకి రాలేదు.. మెగా కాంపౌండ్ వాల్ నుంచే అరంగేట్రం చేశాడన్నది అందరికీ తెలిసిందే. మెల్లమెల్లగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న బన్నీ.. మెగా ఫ్యామిలీలో ఒక్కరిగానే మెలిగేవాడు. చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా కనిపిస్తూ అభిమానులలో సంతోషాన్ని నింపేవాడు.
అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. కూటమి అభ్యర్థికి కాదని వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడంతో..మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌ను ఏకి పడేశారు. దీనికి తోడు ప్రతీ ఫంక్షన్‌లోనూ చిరు, పవన్ నామ జపం చేసే అల్లు అర్జున్ ఓ ఈవెంట్లో పవన్ పేరు చెప్పను బ్రదర్ అనడాన్ని మెగా ఫ్యాన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. పుష్ఫతో అల్లు అర్జున్ మూలాలు మర్చిపోయాడంటూ ఘాటుగానే విమర్శించారు.
తర్వాత జరిగిన అనేక పరిణామాలతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య చీలికలు చెప్పకనే చెబుతుండేవి. కొన్ని సార్లు కోడిగుడ్ల మీద వెంట్రుకలు పీకే బ్యాచ్‌ల హైలెట్ కూడా అయ్యేవి.దీనిని ఇటు వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ పవన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ మరింత రెచ్చగొట్టేవారు.
దీంతో ఏపీలో పుష్ఫ2 రిలీజ్ సమయంలో అధికార పార్టీల ఉన్న పవన్.. అడ్డంకులు ఏర్పరుస్తారని.. అప్పుడు కానీ బన్నీకి బుద్ధి రాదంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ టికెట్ల పెంపు విషయంలో ఏ మాత్రం అడ్డుపడకుండా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పడంతో.. బన్నీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
పుష్ప2 మూవీ ఈనెల 5న విడుదల కానుండటంతో..ఆ సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో టికెట్ పెంపును ఆమోదించినందుకు అల్లు అర్జున్ ఏపీ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నిబద్ధతను కొనియాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇటు మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదానికి తెరపడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.