ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో 4 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా, జిల్లా కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ సమక్షంలో, అక్రమ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
అక్రమ భూముల రిజిస్ట్రేషన్ల రద్దు
రాష్ట్రంలో మొత్తం 13 లక్షల ఎకరాల్లో 4 లక్షల ఎకరాలు అక్రమంగా ఫ్రీహోల్డ్ చేయబడ్డాయని, వీటిలో 25 వేల ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని ఆర్పీ సిసోడియా వెల్లడించారు. అందులో 8 వేల ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్లకు గురైందని గుర్తించామన్నారు. నిషేధిత జాబితాలోకి అక్రమంగా తీసిన 4 లక్షల ఎకరాల భూములతో పాటు, 8 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించామని తెలిపారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ పునరుద్ధరణ
గత ఏడాది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల కాలిపోవడంతో మొత్తం ఆఫీస్ తీవ్రంగా దెబ్బతిందని, ఈ కారణంగా కార్యాలయాన్ని పునరుద్ధరించామని తెలిపారు. బుధవారం ఆర్పీ సిసోడియా ఆధ్వర్యంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. కార్యాలయ దహనం వల్ల నష్టం జరిగిన 2,400 దస్త్రాలను తిరిగి రికవరీ చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న రికార్డుల ఆధారంగా ఈ దస్త్రాలను తిరిగి పొందగలిగామని వివరించారు.
ఫ్రీహోల్డ్ భూముల అక్రమాలు ఎలా బయటపడ్డాయి?
దస్త్రాల రికవరీ ప్రక్రియలో భాగంగా, ఫ్రీహోల్డ్ భూముల అక్రమాలు వెలుగుచూశాయని ఆర్పీ సిసోడియా తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశామని, మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఈ కేసులో ఇతర వ్యక్తులు సంబంధం కలిగి ఉండటంతో దర్యాప్తు పూర్తికావడానికి మరికొంత సమయం పడుతుందని వివరించారు.
రిక్రూట్‌మెంట్ పై స్పష్టత
తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంగీకరించిన ఆర్పీ సిసోడియా, ఉద్యోగుల ప్రమోషన్ సమస్యలతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనా, త్వరలోనే కొత్త రిక్రూట్‌మెంట్ చేపడతామని హామీ ఇచ్చారు.