ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పు తర్వాత ప్రభుత్వ విధానాలలో సమూల మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా, వివిధ పథకాలు, విద్యా సంస్థలు, స్మారక స్థలాలు, స్టేడియంలకు నూతన పేర్లు పెట్టడం పలు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో, విశాఖలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీబీ వీడీసీఎం స్టేడియం పేరును మార్పు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
వైసీపీ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇది వైఎస్‌ఆర్‌ను నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు ప్రభుత్వ యత్నమని ఆరోపిస్తున్నారు. అధికార కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ధోరణిలో పలు మార్పులు చేసినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే, నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగించడం, బాపట్లలో మరొక విగ్రహాన్ని తగలబెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదం వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టింది. అదే విధంగా, విశాఖ సీతకొండ హిల్ వ్యూ పాయింట్‌ను వైసీపీ ప్రభుత్వం వైయస్‌ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చగా, ప్రస్తుత ప్రభుత్వం దానికి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా నామకరణం చేసింది.
కేవలం భౌతిక కట్టడాలు, విశ్వవిద్యాలయాల పేర్లే కాదు, సంక్షేమ పథకాల పేర్లు కూడా మారాయి. జగన్ హయాంలో అమలు చేసిన జగనన్న అమ్మఒడి పథకాన్ని ‘తల్లికి వందనం’గా మార్చారు. జగనన్న గోరుముద్దను ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’గా మార్చారు. అలాగే, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా మార్చారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్య భరోసాగా మార్చడం కూడా పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ మార్పులు అధికారపక్షం-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారి తీస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ నేతలు, “వైఎస్‌ఆర్ పేరు కనిపిస్తే కూటమి ప్రభుత్వానికి భయమొస్తోందా?” అంటూ నిలదీస్తున్నారు. మరోవైపు, అధికారపక్షం మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మార్పు చేయాల్సిన అవసరం ఉందని సమర్థించుకుంటోంది. ఏపీ రాజకీయాలలో పేర్ల మార్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది.