ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జారీ చేయబోతున్న రేషన్ కార్డులు అత్యాధునికంగా ఉండబోతున్నాయి. ఈ రేషన్ కార్డులు క్రెడిట్ కార్డుల్లా డిజైన్ చేయబడి, వాటిపై క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంటుందట. రేషన్ షాపుల్లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రేషన్ తీసుకునే సౌలభ్యం కల్పించనుంది.
ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు కేటాయించిన రేషన్ పరిమితి స్పష్టంగా అందుబాటులో ఉంటుంది. అదనంగా తీసుకోవడం సాధ్యం కాదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని పాత రేషన్ కార్డులను పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కొత్తగా పెళ్లైన దంపతుల కోసం సుమారు 70 వేల దరఖాస్తులు అందగా, కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పుల కోసం కూడా దాదాపు 1.3 లక్షల అప్లికేషన్లు అందాయి. మొత్తంగా రెండు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించనున్నారు.
జనవరి చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని, కొత్త కార్డులు జారీ తర్వాత ఆ సంఖ్య 1.50 కోట్లకు చేరుతుందని అంచనా.
ఈ కొత్త కార్డులపై QR కోడ్ స్కాన్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు తెలుస్తాయి. ప్రత్యేక డిజైన్, ఆధునిక ఫీచర్లతో రేషన్ కార్డుల విధానం విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది.