ఏపీలో అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గత నెలలో పెంచిన పెన్షన్ ను అమలు చేయడం తో పాటు ఉచిత ఇసుకను అమలు చేసారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత రూ 4 వేలకు పెన్షన్ పెంచి అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో మరో రెండు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన సమీక్ష చేశారు. ఈ పథకం తో పాటుగా మరో హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 33 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మరో 83 క్యాంటీన్లు ఈనెలాఖరులోగా పూర్తి చేసేలా ముందుకెళ్లాలని మంత్రి ఆదేశించారు. మరో 20 క్యాంటీన్లు సెప్టెంబరు నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాలిటీ డ్రెయిన్‌లలో పూడిక తీయాలని కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోగా పనులు పూర్తి చేయాలన్నారు.
ఇక ఆగస్టు 15 నుండి ఇంటికే వైద్యాన్ని అందించే పథకం ప్రారభించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని క్యాన్సర్ రోగుల వైద్యసేవల కోసం బడ్జెట్ లో రూ.680 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి మూడు రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకం అమలు అవుతున్న రెండు రాష్ట్రాల్లో తీరు తెన్నుల పైన ఆర్టీసీ అధికారులు నివేదికలు సిద్దం చేసారు. ఏపీలో ఈ పథకం అమలు ద్వారా ఆర్దికంగా పడే భారంతో పాటుగా తీసుకోవాల్సిన చర్యల పైన ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణీకుల సంఖ్య..బస్సుల లెక్కల పైన ఆరా తీయనున్నారు.
మరో ఎన్నికల హామీగా ఉన్న మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఏడాదికి మూడు సిలిండర్లు ఎంత మందికి ఇవ్వాల్సి ఉంటుందన్న లెక్కలను అధికారులు సిద్దం చేస్తున్నారు. ఇక దసరా నుంచి అమలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం అమలు కానుంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో తెలుపు రంగు రేషన్ కార్డులు కూడా దాదాపు అరవై లక్షలకు పైగా ఉన్నట్లు చెబుతున్నారు.