వెంకన్న భక్తులకు అన్నప్రసాదంలో మరో వంటకం

ఆపదమొక్కులవాడి మొక్కులు తీర్చుకోవడానికి తిరుమలకొచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం తినకుండా తిరిగివెళ్లరు. వెంకన్నను దర్శించుకునే సామాన్య భక్తుల నుంచి సంపన్న భక్తుల వరకూ కూడా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించడం మహద్భాగ్యంగా భావిస్తారు. తాజాగా తిరుమల వెంకన్న భక్తుల కోసం ఈ సత్రంలో ఈ రోజు నుంచి భక్తులకు మసాలా వడ ను అందిస్తున్నారు.

దాదాపు 2 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్న భోజనశాలలో ప్రతీ రోజూ సుమారు 12 టన్నుల బియ్యం, 6 టన్నుల కూరగాయలతో రుచిగా శుచిగా వంటకాలను తయారు చేసి భక్తుల ఆకలిని తీర్చుతోంది. ప్రతి నెల 105 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ శ్రీవారి దివ్య ప్రసాదంగా టీటీడీ నిత్య అన్నదానాన్ని కొనసాగిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా నిత్యం లక్షలాది మంది భక్తులకు.. రుచిగా శుచిగా అన్నప్రసాదం అందిస్తున్న నిత్య అన్నదాన సత్రంలో అదనంగా మసాలా వడను వడ్డిస్తుంది.

ఏపీలో కొలువైన కూటమి ప్రభుత్వం తిరుమలేశుని ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదానంపై ఫోకస్ పెరిగింది. క్వాలిటీ, సర్వీస్, మోడ్రన్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అన్నదాన సత్రాన్ని అందుబాటులో తేవడానికి ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే సౌత్ ఇండియన్ చెఫ్ అసోసియేషన్ సహకారంతో సమూల మార్పులకు టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. 2 వేల కోట్ల రూపాయలతో ఉన్న డిపాజిట్ సొమ్ముతో పాటు భక్తులు ఇచ్చే విరాళాలతో నిత్య అన్నదానం ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. భక్తులు డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి శ్రీవారి భక్తులకే ఖర్చు చేస్తున్న టీటీడీ.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తోంది.

నాలుగు హాల్స్ ఉన్న ఈ అన్నదాన సత్రంలో ఒక్కో హాల్లో 1000 మంది కూర్చుని భోజనం చేయొచ్చు. ఇలా ఒక్కో యూనిట్‌లో 80 వేల మంది భక్తులు శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తుండగా.. మరోవైపు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు, కంపార్ట్మెంట్‌లో ఉండే భక్తులకు, నారాయణగిరి షెడ్స్‌లో ఉండే భక్తులకు తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం నుంచే అన్నప్రసాదాన్ని అందిస్తోంది టీటీడీ.