ఇద్దరు సీఎంల సమావేశం… మధ్యలో మోదీ…!

ap, telangana, chandrababu naidu, revanth reddy, telugu states
ap, telangana, chandrababu naidu, revanth reddy, telugu states

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారిని విష‌యం ఏదైనా ఉందంటే.. అది ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల భేటీనే. ఇరు రాష్ట్రాల సీఎంలు తొలిసారి భేటీకి రావ‌డంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీంతో సహజంగానే విభజన సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఏపీ విభజనకు సంబంధించి పరిష్కారం కాకుండా ఉన్న అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావటం ఇదే మొదటిసారి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకం సంక్లిష్టమైన సమస్యగా మారింది. సహజంగానే రెండు రాష్ట్రాల మధ్య విభజన ఆస్తుల పంపకం అంటే విభేదాలు వస్తుంటాయి. కాని ఆ సమస్యలు పది సంవత్సరాలు అయినా తీరకపోవడానికి ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలదే బాధ్యత. పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా అనేక విభజన సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలి ఉన్నాయి. ఇదే ఈ రోజు రెండు రాష్ట్రాలకు కూడా ఇబ్బందులు కలిగించే అంశాలే. ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఈ పదేళ్ల అనుభవాన్ని ఓ సారి పరిశీలిస్తే. అటు ఏపీలోను అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ… ఈ రెండు ప్రభుత్వాలు కూడా సెంటిమెంట్ ను లేవనెత్తి తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికే ప్రయత్నించాయి తప్ప….  విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. జగన్ కేసీఆర్ ఇద్దరు ఎప్పుడు కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య ఎలాంటి తగాదాలు లేవు. ఆ బీఆర్ఎస్, వైసీపీ పార్టీల మధ్య ఎప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నది లేదు. దీంతో వీరి మధ్య ఉన్న సత్సంభాదల దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలు తీరతాయని అందరూ భావించారు. కాని ఈ ఇరువురి మధ్య ఉన్న సంబంధం ఎప్పుడు కూడా ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఏనాడు ఉపయోగపడలేదు. అయితే జగన్, కేసీఆర్ లు రెండు రాష్ట్రాల సమస్యల కోసం సమావేశం కాలేదని వారి సొంత అజెండాల కోసమే సమావేశమయ్యారని ఇరు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శించాయి.

రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల ముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చిన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. ఇక్కడ వ్యక్తిగతంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరు కూడా ఒకే పార్టీకి గతంలో పనిచేశారు. ఇప్పుడు వీరి సంబంధం రెండు రాష్ట్రాల సమస్యలను తీరుతాయని ఇరు రాష్ట్రాల్లోని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాని ఇక్కడ  చిక్కు వచ్చి పడింది. వాళ్ళిద్దరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరు ఇద్దరి మధ్య కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి యూటర్న్ తీసుకుంటూ ఉంది. కేంద్ర చొరవ తీసుకున్న ఈపాటికి చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీల అమలుతో పాటు ఇతరత్రా సమస్యలు తీర్చడం పై కేంద్రం వెనకడుగు వేసింది.  దీంతో కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం లో భాగమైన చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కలుస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చి జరిగే అవకాశముంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం.. తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. ఈ విషయంపై ఈ భేటీతో ఓ క్లారిటీ రానుంది. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీ ని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్ లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. అయితే వీటన్నింటికి ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ వర్గాల్లోనూ.. అటు కూటమి ప్రభుత్వంలోనూ సీఎంల సమావేశం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారైనా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల సమస్యలను తీర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని అందరూ భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY