తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ నేడు ఘనంగా ప్రారంభమయింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ పంచుకున్నారు.
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ఈ గ్లోబల్ సదస్సు విజయవంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు నా శుభాకాంక్షలు. ఈ వేదిక వృద్ధి, ఆవిష్కరణ మరియు పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుందని ఆశిస్తున్నాను.” అని ఆయన ఆంగ్లంలో ట్వీట్ చేశారు.
My best wishes to the Telangana Rising Global Summit 2025. May this platform open new avenues for growth, innovation and progress. @revanth_anumula@GlobalSummitTG
— N Chandrababu Naidu (@ncbn) December 8, 2025
రెండు తెలుగు రాష్ట్రాల సహకారం
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా అభివృద్ధి లక్ష్యాలను కొనసాగిస్తున్నప్పటికీ, ఈ తరహా అంతర్జాతీయ వేదికకు ఏపీ సీఎం శుభాకాంక్షలు తెలపడం సహకార స్ఫూర్తిని సూచిస్తోంది. ఈ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు, సాంకేతిక సహకారం పెరిగి, రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పారిశ్రామికంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరవచ్చని భావిస్తున్నారు.



































