ఏపీలో వర్షాలు…వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరదల్లో మరణించిన వారి సంఖ్య 33కు చేరగా..ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 25 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారు. కాగా ఎన్టీఆర్ జిల్లాలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
మరోవైపు వరద బాధితుల సహాయార్ధం పెద్ద సంఖ్యలో విరాళాలు వస్తున్నాయి. సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. కేంద్రం కూడా తక్షణ సాయం ప్రకటించడానికి సిద్దమైంది.ఏపీలో వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర అధికారుల టీం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసింది. కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన టీంతో పాటు ..కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఏపీలో వరదల జరగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు కూడా కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో కేంద్రం ఏపీ విపత్తుకు మద్దతుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీ పటిష్ఠత కోసం చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు. కేంద్రానికి ఇచ్చే నివేదిక ఆధారంగా తక్షణ సాయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాధమిక నివేదిక అందించింది.
ఈ వరదల వల్ల ఏపీ వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు 3,756 కి.మీటర్ల పొడవున దెబ్బ తిన్నాయని తేలింది. పంచాయతీరాజ్ రోడ్లు 348కిలోమీటర్లు దెబ్బతిన్నాయి. విజయవాడతో పాటు వివిధ పట్టణాల్లో 533.57 కి.మీ రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. 33 మంచినీటి పథకాలు దెబ్బతిన్నాయి. 1,69,370 హెక్టార్లలో వ్యవసాయం, 19,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు ముంపునకు గురయినట్లు తేలింది. అలాగే 46.22 హెక్టార్ల ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయి. 275 పశువులు, 59,975 కోళ్లు వరదల వల్ల మృత్యువాతపడ్డాయి. 403 మత్స్యకార బోట్లు పూర్తిగా, 26 బోట్లు పాక్షికంగా దెబ్బతినగా.. 414 వలలు పాడైపోయాయి.
ఈ ఐదురోజుల్లో విజయవాడలో 339 రైళ్లు రద్దు కాగా, 181 రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. వర్షాలు తగ్గడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు వేగంగా సాగుతున్నాయి. విజయవాడతో పాటు ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో 214 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయగా, 45,369 మంది పునరావాసం పొందుతున్నారు. 158 వైద్యశిబిరాల్లో సేవలు అందిస్తున్నారు. 344 మంది గర్భిణులను హాస్పిటల్స్ కు తరలించారు. 50 ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ బృందాలు, ఆరు హెలికాప్టర్లు, 228 బోట్లతో పాటు 315 మంది గజ ఈతగాళ్లు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.