ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్

AP Govt To Provide Alternative Jobs For Medically Unfit RTC Staff

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉండగా ఆరోగ్య కారణాల దృష్ట్యా మెడికల్ అన్ ఫిట్ (Medical Unfit) అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేవలం డ్రైవర్లకు మాత్రమే పరిమితమైన ఈ విధానాన్ని, ఇప్పుడు సంస్థలోని ఉద్యోగులందరికీ వర్తింపజేయడం గమనార్హం.

ప్రభుత్వ నిర్ణయంలోని ముఖ్యాంశాలు:
  • అందరికీ అవకాశం: గతంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు కేవలం డ్రైవర్లకు మాత్రమే మెడికల్ అన్ ఫిట్ అయితే ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇచ్చే వారు. ఇప్పుడు డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మిగిలిన కేటగిరీల ఉద్యోగులందరికీ ఈ అవకాశం కల్పించారు.

  • కట్ ఆఫ్ డేట్: 2020 జనవరి 1వ తేదీ తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులందరికీ ఈ కొత్త ఉత్తర్వులు వర్తిస్తాయి.

  • 21 కేటగిరీల గుర్తింపు: కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు ఏయే 21 కేటగిరీల్లో మెడికల్ అన్ ఫిట్ అయ్యేవారో, ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం (APPTD) అయిన తర్వాత కూడా అవే కేటగిరీలను పరిగణనలోకి తీసుకుంటారు.

  • ప్రత్యామ్నాయ పోస్టులు: అన్ ఫిట్ అయిన వారికి వారి అర్హతను బట్టి ఆర్టీసీలో కండక్టర్, రికార్డు ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక్ పోస్టులు ఇస్తారు.

  • ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం: ఒకవేళ ఆర్టీసీలో ఖాళీలు లేకపోయినా లేదా అక్కడ పని చేయడానికి అర్హత లేకపోయినా.. జిల్లా కలెక్టర్ల ద్వారా ఇతర ప్రభుత్వ శాఖల్లో వారి విద్యార్హతలకు తగ్గట్టుగా ఉద్యోగం కల్పిస్తారు.

  • ఆర్థిక ప్రయోజనాలు: ఏ ఉద్యోగానికి అర్హత లేని వారికి లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) పొందాలనుకునే వారికి అదనపు ద్రవ్య ప్రయోజనాలు (Monetary Benefits) కల్పిస్తారు.

అమలు ప్రక్రియ:

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఎపీపీటీడీ (APPTD) కమిషనర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఉద్యోగ సంఘాల హర్షం:

ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు (NMU, EU, కార్మిక పరిషత్) హర్షం వ్యక్తం చేశాయి. వేలాది కుటుంబాలకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రవాణా శాఖకు ధన్యవాదాలు తెలియజేశాయి.

మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయం. ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడతామన్న భయంలో ఉన్న కార్మికులకు ఈ ఉత్తర్వులు కొండంత అండగా నిలుస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడంలో ఇదొక కీలక అడుగు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here