ఏపీని ఇంకా వర్షాలు వదలనంటున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో.. మొన్నటి వరకు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా..వాంగులు ,వంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల వల్ల బెజవాడ ఎన్నడూ లేనంతగా అతలాకుతలం అయింది.
ఈ వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. పలువురు మృత్యువాత పడ్డారు. అనేక జిల్లాలలో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ బంగాళాఖాతంలో అక్డోబర్ 12 నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, తరువాత పశ్చిమ దిశగా అది పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని అధికారులు అంచనావ వేస్తున్నారు. ఆ తరువాత అల్పపీడనం కాస్తా వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అక్టోబర్ 17 నాటికి ఏపీలో తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను ప్రభావం వల్ల అక్టోబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.