ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీ వంటి పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ డివిజన్లలో మార్పులు, విద్య, వైద్య, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు సంబంధించి మంత్రివర్గ చివరి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే కేబినెట్ భేటీకి మంత్రులు ఖాళీ లెటర్ హెడ్‌లతో హాజరవటం విశేషం. ఈ భేటీ తర్వాత మంత్రులు రాజీనామాలు చేశారు. మొత్తం 24 మంది మంత్రులు రాజీనామాలు చేయగా, వీరందరి రాజీనామా లేఖలను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఈ రాత్రికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిన్న సీఎం జగన్ గవర్నర్ ని కలిసి మంత్రుల రాజీనామా విషయం గురించి సమాచారం అందించిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుత మంత్రులలో కేవలం ముగ్గురు లేదా నలుగురు మాత్రమే కొనసాగనున్నారని సమాచారం. ఈనెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రి వర్గానికి సంబంధించిన జాబితా ఈ నెల 10న వెలువడే అవకాశం ఉంది. జిల్లాల వారీగా, సామజిక వర్గాల వారీగా కొత్త మంత్రుల ఎంపిక జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా రాజీనామా చేసిన మంత్రులకు కేబినెట్ ర్యాంక్ ఇవ్వనున్నారని, జిల్లా అభివృద్ధి మండలి తరహాలో ఈ మాజీ మంత్రులకు పదవులు ఇస్తారని చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుత మంత్రుల రాజీనామాల నేపథ్యంలో ఆయా మంత్రుల పేషీల్లో హడావుడి నెలకొంది. ఈ రోజే మంత్రులుగా చివరి రోజు కావడంతో మంత్రులందరూ సిబ్బందితో కలిసి లంచ్ చేశారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ