లోక్ సభ హాజరులో ఏపీ ఎంపీలు టాప్

ఇటీవల 18వ లోక్ సభ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలపై పీఆర్ఎస్ ఇండియా అనే సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో టీడీపీ నుంచి 16, వైసీపీ నుంచి నలుగురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అయితే ఎంపీలు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో ఎంపీలు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై.. పీఆర్ఎస్ ఇండియాడాట్ ఆర్గ్ సమాచారం సేకరించింది.

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అమలాపురం ఎంపీ జి.ఎం హరీష్ 99శాతం హాజరుతో పార్లమెంట్ సమావేశాలకు హాజరయి ప్రధమ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత విశాఖ ఎంపీ శ్రీ భరత్ 97శాతం, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు 93శాతంతో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.అలాగే పార్లమెంటుకు 90 శాతానికి పైగా హాజరైన వారిలో ఏడుగురు ఎంపీలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. వారిలో కలిసెట్టి అప్పలనాయుడు, జి.ఎం హరీష్, శ్రీ భరత్, దగ్గుమల్ల ప్రసాదరావు, బస్తీపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు. వీరంతా తొలిసారిగా ఎంపీలుగా ఎన్నికైన వారే కావడం విశేషం. కాగా వైసీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం 54శాతం హాజరుతో చివరి స్థానంలో ఉన్నారు.

అలాగే లోక్ సభలో ప్రశ్నలు వేయడంలో కూడా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొదటి స్థానంలోనే ఉన్నారు. ఆయన ఏకంగా 89 ప్రశ్నలు వేసి కొత్త రికార్డు కూడా సృష్టించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 84 ప్రశ్నలతో రెండవ స్థానంలో నిలవగా.. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ 82 ప్రశ్నలు వేసి మూడవ స్థానంలో నిలిచారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అత్యల్పంగా 22 ప్రశ్నలు అడిగారు.

లోక్ సభలో చర్చల విషయానికి వస్తే..టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు 22 చర్చల్లో పాల్గొని టాప్ గా నిలిచారు. వైసీపికి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి 19 చర్చలతో రెండో స్థానంలో నిలిచారు. జనసేనకు చెందిన మచిలీపట్నం ఎంపీ బాలసౌరి 18 చర్చలతో మూడవ స్థానంలో ఉన్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథి కేవలం ఒకేఒక చర్చలో మాత్రమే పాల్గొన్నారు.