ఏపీలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో పాటుగా వేడిగాలులకు జనాలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదంగా.. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.దీంతో మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలలో ఎండలు ఇంకెంత భయంకరంగా ఉంటాయోనని ఏపీ వాసులు భయపడుతున్నారు.
ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 62 ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరులో వడగాల్పులు ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అటు కోస్తాతో పాటు రాయలసీమలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో వేడి గాలుల తీవ్రత కూడా పెరుగుతుందని.. జాగ్రత్తలు అవసరం వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
ఫిబ్రవరిలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఎండ ఇలా ఉంటే ఇక ఏప్రిల్-మే నెలల్లో పరిస్థితేంటని జనాలు భయపడిపోతున్నారు. గతంలో కంటే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో… ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిదని.. వృద్ధులు, గర్భిణులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ తగినంత నీరు తాగుతూ ఉండాలని చెబుతున్నారు. తేలికపాటి, కాటన్ దుస్తులు ధరించడం మంచిది. పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని..అలాగే డీహైడ్రేషన్‌కు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.