ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అనేక పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోస్తోంది. అలాగే, కొత్త పథకాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించిన ఓ కీలక పథకానికి ఏపీని ఎంపిక చేసింది. దీని వల్ల రాష్ట్రంలోని పలు పంచాయతీలకు మేలు జరగనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే పంచాయతీల బలోపేతంపై దృష్టి సారించారు. గతంలో ఐదేళ్లుగా నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న పంచాయతీలకు కేంద్రం నుంచి రెగ్యులర్‌గా నిధులు తీసుకొచ్చి అందిస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీల బలోపేతానికి మరో కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీనివల్ల ఆయా పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి జరుగనుంది.
కేంద్ర ప్రభుత్వం పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి కోసం వికసిత్ పంచాయత్ కర్మయోగీ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటి వరకు గుజరాత్, అస్సాం, ఒడిశా వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకాన్ని పవన్ కళ్యాణ్ చొరవతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కూడా విస్తరించారు. దీనికి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అధికారికంగా నిర్ణయం తీసుకుంది.
ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 15 పంచాయతీలను ఎంపిక చేశారు. ఈ పంచాయతీల్లో అధికార వికేంద్రీకరణ, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వంటి కీలక చర్యలు తీసుకోనున్నారు.
ఎంపికైన 15 పంచాయతీలు:
పాడేరు మండలం: కిండంగి, మినుములూరు, గుతులపుట్టు, డోకులూరు, కడెలి, డి.గొందూరు, వంజంగి
హుకుంపేట మండలం: మట్టం, తీగవలస, తాడిగిరి, కొట్నపల్లి, మెట్టుజోరు, జీకే మందా, తాడిపుట్టు
జీ మాడుగుల మండలం: బోయితిలి
ఈ పంచాయతీలను వికసిత్ పంచాయత్ పథకం కింద మోడల్ పంచాయతీలుగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది.