
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో వార్ వన్ సైడ్ అయిపోయింది. వైఎస్సార్సీపీ కనీవిని ఎరుగని ఓటమిని చూస్తోంది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ తనను కాపాడతాయని భావించిన జగన్ వర్గీయులకు కోలుకోలేని షాక్ తగిలింది. కూటమిగా వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీలను నమ్మిన ఏపీ వాసులు వైఎస్సార్సీపీ పనితనానికి బైబై చెప్పేశారు. వైసీపీ మేనిఫెస్టో కంటే కూటమి మేనిఫెస్టో అద్భుతంగా ఉండటమో.. జగన్ పాలనపై విరక్తో తెలియదు కానీ.. కూటమికి అనుకూలంగా ఓటేశారు.
తెలంగాణ ఫలితాలలో నూటికి నూరు శాతం ఎగ్జిట్ పోల్స్ లో మంచి ఫలితాలను అందించిన ఆరా మస్తాన్ సర్వే…ఏపీ ఎన్నికల ఫలితాలతో విశ్వసనీయత కోల్పోయినట్లే అయింది. 104 స్థానాలు లేదా అంతకు మించిన స్థానాలలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్ వేసిన అంచనాలు బొక్క బోర్లా పడ్డాయి. ఇకపై ఆరా మస్తాన్ సర్వేలను నమ్మే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
తాను వెల్లడించిన ఫలితాలు తప్పయ్యే ఛాన్స్ లేదని.. ఒకవేళ తప్పితే వచ్చే ఎన్నికలలో ఆరా మస్తాన్ సర్వే పేరే వినిపించదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో జగన్ పై అభిమానంతో కొమ్ముకాసి మరీ సర్వే ఫలితాలు తారుమారు చేసి చెబితే ఇలాంటి మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని జనసైనికులు, కూటమి వర్గాలు కామెంట్లు చేస్తున్నారు.ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ను మించిన ఘోరమైన ఓటమి జగన్ పార్టీకి దక్కడంతో..ఇక వైసీపీ తిరిగి పుంజుకోవడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.
మరోవైపు జగన్ ఈ ఎన్నికలలో కచ్చితంగా గెలుస్తారని చెబుతూ వచ్చిన వేణుస్వామి జ్యోతిష్యం కూడా అపహాస్యం పాలయింది. అసలు పవన్ కళ్యాణ్‌కు అధికారయోగమే లేదని.. పవన్ గెలిచే అవకాశం అస్సలు లేదని వేణుస్వామి చెప్పగా.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. మెజార్టీతో రికార్డుల సునామీని క్రియేట్ చేశారు. దీంతో మరోసారి వేణుస్వామి ట్రోలింగ్ కు గురవుతున్నారు. వేణుస్వామి చేతులారా తన గొయ్యిని తానే తవ్వుకున్నాడని.. ఇంతవరకూ కాస్తో , కూస్తో నమ్మేజనాలు కూడా అతడి మాటలను నమ్మరంటూ కామెంట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY