వరద ప్రభావం నుంచి ఏపీ కోలుకోకముందే మరో ముప్పు వెంటాడుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసురు పట్టి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండగా.. రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయి.
ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాల పైన అలర్ట్ జారీ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు సోమవారం నాడు సెలవు ప్రకటించినట్టు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసారు. లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు జలాశయాలకు వరద పెరుగుతోంది. రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీవర్షాల నేపథ్యంలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నదులతో పాటు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖపట్నంలో కొండవాలు ప్రాంతాలకు ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో కూడా మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయిని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, కొమురంభీం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్ జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
అలాగే.. పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి, వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్డ్ జారీ చేసింది. భారీ వర్షాల కురిసే అవకాశం ఉండడంతో -ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ శాఖ.