
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు హీట్ భానుడి భగభగలతో పోటీ పడుతోంది.అయితే అన్ని నియోజకవర్గాలలో ఎక్కువ మంది చూపు పిఠాపురంపైనే ఉంది. ఇక్కడ కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే..వైఎస్సార్సీపీ నుంచి ఎంపీ వంగా గీత పోటీ పడుతున్నారు. అయితే తాజాగా ఊహించని వ్యక్తి ఎంట్రీ ఇచ్చి పోటీకి తాను సై అంటూ బరిలోకి దిగడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీ అయిపోయారాయన.
నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలంతా ప్రచారంలో దూకుడు పెంచేశారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానుండటంతో నేతల్లో టెన్షన్.. ఏపీ వాసుల్లో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే పిఠాపురంలో ఈ సారి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడంతో .. అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైన పడింది. అయితే అక్కడ నామినేషన్లు వేసిన వారిలో ఏడిద భాస్కర్‌రావు పేరు వినిపించగానే ఎవరాయన అంటూ ఆరా తీయడం ప్రారంభించారు.
పిఠాపురంలోకి ఇలా అనూహ్యంగా తెరపైకి వచ్చిన భాస్కర్‌రావు చెప్పులు కుట్టుకునే సాధారణమైన వ్యక్తి. పిఠాపురానికి చెందిన ఏడిద భాస్కరరావు బ్యాచిలర్ డిగ్రీలో పొలిటికల్ సైన్స్ చదివారు. ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. కుటుంబాన్ని పోషించుకోవడానికి చెప్పులు కుట్టే పని చేస్తున్నారు. తనలా చదువుకుని ఉద్యోగాలు దొరకక.. నిరుద్యోగులుగా ఉంటూ ఇబ్బందులు పడుతున్నవారందరికీ తమ కష్టాలు తీర్చడానికి పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగినట్లుగా భాస్కర్ రావు చెబుతున్నారు.
పాదరక్షలు కుట్టుకుంటూ యూఎస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన అబ్రహాం లింకన్‌ను తాను ఆదర్శంగా తీసుకున్నానని.. స్థానికుడిగా తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాస్కర్ రావు అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలేంటి.. వాటి పరిష్కారానికి తన దగ్గర గల మార్గాలేంటి అని తాను రాసుకున్నవాటినే తన మేనిఫెస్టోగా చూపిస్తూ అందరినీ ఓట్లు అడుగుతున్నారు భాస్కర్‌రావు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఇలాంటి యువకుడు పోటీ చేయడంతో మరోసారి పిఠాపురం హాట్ టాపిక్ అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY