ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల పంపిణీ వివాదం రోజురోజుకు మరింత ముదురుతుంది. కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటా విషయంపై స్పష్టమైన అభిప్రాయాలన్నిటినీ స్టేట్‌మెంట్ రూపంలో ఇప్పటికే సమర్పించగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాలను, పత్రాలను ఇంతవరకూ సమర్పించకపోవడాన్ని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తప్పు పట్టింది.
నాలుగు వారాల్లోగా దీనిపై స్టేట్మెంట్ సమర్పించాలంటూ మే నెలలోనే ట్రిబ్యునల్ ఆదేశించిందని.. తెలంగాణ తన స్టేట్‌మెంట్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ మాత్రం జాప్యం చేయడాన్ని ట్రిబ్యునల్ ఆక్షేపించింది. అసెంబ్లీ ఎన్నికల వలనే స్టేట్మెంట్ సమర్పించడం ఆలస్యమైందని, దీనికి తోడు ప్రభుత్వం మారడంతో అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డు మారారని వివరించిన ఏపీ తరపున హాజరైన న్యాయవాదులు.. అందువల్లనే నిర్దిష్ట గడువులోగా ఇవ్వలేకపోయినట్లు న్యాయవాదులు ట్రిబ్యునల్ ముందు చెప్పుకొచ్చారు. అయితే ఈ కారణాన్ని ట్రిబ్యునల్ సమర్ధించలేదు.
ఆంధ్రప్రదేశ్ తరఫున వాదించిన న్యాయవాదులు లేవనెత్తిన వాదనలు సమంజసంగా, సహేతుకంగా లేవని వ్యాఖ్యానించిన ట్రిబ్యునల్.. నాలుగు వారాల్లోగా స్టేట్మెంట్లు ఇవ్వాల్సిందేనని డెడ్ లైన్ విధించింది. అంతేకాకుండా ఏపీ ఒకవేళ స్టేట్మెంట్లు ఇవ్వకపోయినట్లయితే ఇకపై వాటిని సమర్పించనక్కరలేదని దానిపై ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని కాస్త సీరియస్ గానే వ్యాఖ్యానించింది.
కేవలం నాలుగు వారాల్లోగా ఆంధ్రప్రదేశ్ తన స్టేట్‌మెంట్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించాలని, ఆ తర్వాత వాటిని తెలంగాణ పరిశీలించి తమ అభ్యంతరాలను రెండు వారాల్లోగా తిరిగి ట్రిబ్యునల్‌కు తెలియజేయాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మొత్తంగా ఆరు వారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణను ఆగస్టు 28, 28 తేదీల్లో చేపట్టనున్నట్లు ట్రిబ్యునల్ తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన వాదనలను తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ కూడా తప్పుపట్టారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావించిన కారణం కనుక నిజమే అయితే..అత్యున్నత ధర్మాసనమైన సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌పై జరుగుతున్న వాదనలకు ఏపీ తరఫున న్యాయవాదులు ఎలా హాజరవుతున్నారని వైద్యనాధన్ ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ