ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల కోసం ఉప ఎన్నిక జరపడానికి ఈరోజు నోటిఫికేషన్ వెలువడింది. అంతేకాకుండా నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ అయ్యింది. వైసీపీకి చెందిన బీద మస్తాన్ రావు, మోపీదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య ..రాజ్యసభ పదవులతోపాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు.
బీద మస్తాన్ రావుతో పాటు మోపీదేవి వెంకటరమణ టీడీపీలో చేరగా.. ఆర్ కృష్ణయ్య మాత్రం బీజేపీకి దగ్గరవుతున్నారు. అయితే ఇప్పుడున్న సంఖ్యాబలాన్ని బట్టి కూటమిలో మూడు పార్టీలు ఒక్కో పదవి చొప్పున తీసుకుంటాయన్న ప్రచారం నడిచింది.ఇప్పుడున్న తర్వాత టీడీపీకి రెండు,జనసేనకు ఒకటి అన్నట్లు టాక్ నడిచినా కూడా.. ఇప్పుడు మాత్రం టీడీపీకి రెండు, బీజేపీకి ఒకటి ఖరారు అయినట్లు తెలుస్తోంది.
టీడీపీలో చేరిన బీద మస్తాన్ రావుకు మరోసారి పదవి ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో టీడీపీలో చేరితే రాజ్యసభ పదవి రెన్యువల్ చేయాలని మస్తాన్ రావు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకో పదవి విషయంలో ..కంభంపాటి రామ్మోహన్ రావు,గల్లా జయదేవ్, సానా సతీష్‌ల మధ్య పోటీ నెలకొంది. కానీ సానా సతీష్‌కే ఎక్కువ సీటు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు బీజేపీకి సంబంధించి చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ముందు వినిపించినా.. మారిన పరిస్థితుల వల్ల ఆర్ .కృష్ణయ్యకు బీజేపీ నుంచి ఛాన్స్ ఇస్తారని టాక్ నడుస్తోంది. తెలంగాణకు చెందిన కృష్ణయ్య సేవలను అక్కడ వినియోగించుకోవడానికి బీజేపీ పెద్దలు పవన్‌ను కూడా ఒప్పించినట్లు తెలుస్తోంది. అందుకే జనసేన రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి.