ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.జీవో ప్రకారం కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా విచారణ చేపట్టడానికి కూటమి సర్కార్ మంగళవారం రాత్రి గెజిట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు మాత్రం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటూ కండిషన్‌ను గెజిట్‌లో యాడ్ చేసింది. ఈ ఉత్తర్వులు జులై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా కూటమి ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
ఏపీలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించడానికి, పెంచడానికి ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. ఢిల్లీ స్పెషల్ పోలీసు వ్యవస్థాపక చట్టం-1946లోని సెక్షన్-3 ప్రకారం..ఇప్పుడు సీబీఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు కూటమి ప్రభుత్వం ఈ గెజిట్లో పేర్కొంది. దీని ద్వారా సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాలపై విచారణ కోసం ఏపీ సర్కారు లాంఛనంగా అనుమతిని ఇచ్చినట్టయింది.
మరోవైపు గతంలో నో అన్న సీఎం చంద్రబాబు..ఇప్పుడు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2014 నుంచి 2019 వరకు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు సీబీఐని ఆంధ్రప్రదేశ్‌లోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు.సీబీఐకు ఏపీలో ఎంట్రీ లేనే లేదంటూ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జీవో చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాని మోదీ ప్రభుత్వం సీబీఐతో సహా ఇతర కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆరోపించారు. దీన్ని కారణంగా చెబుతూనే ఏపీలో సీబీఐ ఎంట్రీ లేకుండా చేశారు.
ఏపీలో సీబీఐ విచారణకు టీడీపీ కూటమి ప్రభుత్వమే అప్పట్లో అంటే 2014-19 మధ్య కాలంలో అనుమతిని నిరాకరించింది. ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండగా.. ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వడంపై రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా చర్చ నడుస్తోది. అయితే మాజీ సీఎం జగన్‌ను ఇరుకున పెట్టడానికే సీబీఐని ఏపీలో అనుమతి ఇచ్చారని వాదన తెర మీదకు వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసు ఇంకా సీబీఐ కోర్టులోనే ఉంది. మొన్నటి వరకూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. కేంద్రంతో పొత్తు సాగిస్తూ జగన్ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. కానీ ఇప్పుడు అధికారం బదిలీ అయి కూటమి చేతిలోకి వెళ్లిపోయింది.
దీనికితోడు జగన్ అధికారంలో ఉండగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతూ టీడీపీ నేతలను ఎంతగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబును 55రోజులు రాజమండ్రి జైలులో ఉంచి నానా ఇబ్బందులు పెట్టారు. దీంతో ఇక జగన్‌ను ఇలాగే వదిలేయకూడదని నిర్ణయానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. సీబీఐకి అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి.