ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దు కానుందా?.. వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపించనుందా?.. అనే అంశాలపై కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం తొలగించబోతోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఎన్నికలప్పుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని.. పైగా వాలంటీర్ల జీతాలను కూడా డబుల్ చేస్తామని కూటమి నేతలు మాటిచ్చారు. ఆ సమయంలో కొందరు వాలంటీర్లు రాజీనామా చేస్తుంటే.. చేయొద్దని కూడా సూచించారు. అయినప్పటికీ సగానికి పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. జులై 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా వాలంటీర్లను ప్రభుత్వం వాడుకోలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లే ఇంటింటికి తిరిగి పింఛన్ పంపిణీ చేసే వారు. కానీ ఇటీవల కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి వాలంటీర్లకు బదులుగా.. సచివాలయ ఉద్యోగులను వాడుకుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్లు ఖాళీగానే ఉన్నారు. వారికి రెండు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేదు. ఈక్రమంలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తొలగించబోతున్నారనే కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలోనే వాలంటీర్ వ్యవస్థకు ఎండ్ కార్డ్ పడనుందనేది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ తప్పుడు వార్తలని.. వాలంటీర్ వ్యవస్థను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి.. వారి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు.. వాలంటీర్ల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. సాంఘిక సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు ఎండ్ కార్డ్ పడబోతుందంటూ జరుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డ్ పడినట్లు అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE