ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మారిన పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లలను కనడం తప్పేమీ కాదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాలు ఇప్పటికే ఈ అంశాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. ‘‘జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా దేశాలు వృద్ధుల జనాభా పెరుగుదల కారణంగా యువతను పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి’’ అని చంద్రబాబు తెలిపారు.
‘‘మనదేశంలో కూడా వృద్ధుల జనాభా పెరుగుతున్నది. దీన్ని నియంత్రించేందుకు కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహించాల్సి ఉంటుంది’’ అని ఆయన సూచించారు. ప్రత్యేకంగా నైపుణ్యమున్న మానవ వనరుల కొరత కూడా ప్రధాన సమస్యగా ఉందని ఆయన గుర్తుచేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లిలో విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు, ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘గతంలో మనం పెద్ద కుటుంబాలున్న నాయకులను ఎన్నికల నుంచి డిబార్ చేసేవాళ్లం. కానీ రానున్న రోజుల్లో తక్కువ మంది పిల్లలున్న నాయకులపై ఆంక్షలు విధించే పరిస్థితి రానె అవకాశం ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే తరహాలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా జనాభా పెంపుపై ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.