ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడానికి గల బలమైన కారణాల్లో లిక్కర్ పాలసీ ఒకటి. వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత బెల్టు షాపులను పూర్తిగా ఎత్తేసి లిక్కర్ షాపులను తగ్గించింది. అంతేకాకుండా నాణ్యమైన బ్రాండ్లను తిసేసి కొత్త రకపు బ్రాండ్లను తీసుకొచ్చి మద్యం రేట్లను విపరీతంగా పెంచింది. చాలా మంది ఏపీలో నాణ్యతలేని మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇదే అంశాన్ని ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీ పావుగా వాడుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లింది.
అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీని రద్దు చేస్తామని కూటమి ప్రకటించింది. అలాగే నాణ్యమైన బ్రాండ్ల మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి రెండు నెలలు కావస్తుండడంతో.. పాత లిక్కర్ పాలసీని రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. త్వరలోనే దాని స్థానంలో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ గడువు సెప్టెంబర్ చివరి నాటికి ముగియనుంది. ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు.
ఏపీలో మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో 2,934 లిక్కర్ షాపులు ఉన్నాయి. అయితే వాటన్నింటిని ఎత్తి వేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ తర్వాత మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారట. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాణ్యత లేని మద్యం బ్రాండ్లను తొలగించి.. వాటి స్థానంలో నాణ్యమైన బ్రాండ్లను తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారట. త్వరలోనే సంబంధిత అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ