వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్‌మాల్ జరినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైంది. అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో సీఐడీ స్పందించింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను సీఐడీ ఆదేశించగా.. సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు రూ.150 కోట్లతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని.. భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రలో ఆటగాళ్లకు అందించించేందుకు నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయోయాయి.. దీంతో ఆ కిట్ల నాణ్యతలో డొల్లతనం బయటపడింది. జర్సీల కొనుగోళ్ల నుంచి ఆటగాళ్లకు కల్పించిన భోజనంలోనూ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై అప్పట్లోనే చర్చ జరుగుతోంది. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని? క్రీడాకారులకు ఇచ్చినవి ఎన్ని? వాటిలో నాణ్యత తదితర అంశాలపై విచారణ చేయనున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకోసం సీఐడీ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
ఏపీలో వైసీపీ నేతలపై వరుస కేసులతో ఆ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసులో జైల్లో ఉన్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దమవుతోంది. ఇలా వరుసగా వైసీపీ నేతలు ఒక్కొక్కరిపై కేసులు నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ ఆరోపణలపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎలా స్పందిస్తారన్నది చూడాలి.