ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడంపై చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మేరకు శుక్రవారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాజధానిని నాశనం చేయాలని కుట్రలు పన్నితే, తమ కూటమి ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా దానికి శాశ్వత చట్టబద్ధత కల్పించి ఒక ‘శాసనం’ చేసిందని గంభీరంగా ప్రకటించారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజా విజయం
అమరావతికి చట్టబద్ధత లభించడం అనేది కేవలం ఒక పార్టీ విజయం కాదని, ఇది రాష్ట్ర ప్రజలందరి విజయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లోక్‌సభ మరియు రాజ్యసభల్లో దాదాపు 35 మంది ఎంపీలు అమరావతికి మద్దతుగా గళం ఎత్తడం విశేషమని ఆయన గుర్తు చేశారు.
దేశమంతా ఒక దారిలో ఉంటే, వైసీపీ మాత్రం పట్టుబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టేలా వైసీపీ ప్రవర్తించిందని, కానీ నేడు అమరావతికి లభించిన రాజ్యాంగ రక్షణతో ఆ కుట్రలన్నీ పటాపంచలయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ.. నా బ్రెయిన్ చైల్డ్
తెలంగాణ ప్రాంతం పట్ల తనకు ఉన్న మమకారాన్ని ఈ సందర్భంగా సీఎం పునరుద్ఘాటించారు. “తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్, తెలుగుదేశం పార్టీ పుట్టిందే అక్కడ.. నేను తెలంగాణకు ఎప్పటికీ వ్యతిరేకం కాదు” అని ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు మనుగడ కోసం ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని తాను ఆనాడే పట్టుబట్టానని, తన అనుభవం మరియు కేంద్రం సహకారంతో ఆ పక్రియను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. ఆ ఏడు మండలాలు కలిస్తేనే పోలవరం సాకారమవుతుందని కేంద్రం కూడా గుర్తించిందని ఆయన వివరించారు.
నాడు సమర్థించి.. ఆపై వ్యతిరేకించి..
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మరియు భౌగోళిక పరిస్థితుల ఆధారంగానే గుంటూరు-విజయవాడ మధ్య అమరావతిని ఎంపిక చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఈ ప్రాంతానికి ఉన్న రాజకీయ, సాంస్కృతిక మరియు సహజ వనరుల ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు.
గతంలో అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ కూడా రాజధానిగా అమరావతిని సమర్థించారని, కనీసం 30 వేల ఎకరాల భూమి ఉండాలని ఆనాడే జగన్ వ్యాఖ్యానించారని సీఎం గుర్తు చేశారు. అప్పుడు మద్దతు తెలిపి, అధికారం రాగానే మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు.
మీడియా ప్రతినిధులకు స్వీట్లు పంచిన సీఎం
సమావేశం ముగిసిన తర్వాత మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. అమరావతి అంటే తనకు ఒక ఎమోషన్ అని, ఈ గర్వకారణమైన క్షణంలో తాను కూడా స్వీట్ తింటానని చెబుతూ ఆయన స్వయంగా అందరికీ స్వీట్లు తినిపించారు.
నవ్వుతూ, ఉత్సాహంగా మీడియా వారితో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అమరావతి నిర్మాణం ఇక అప్రతిహతంగా సాగుతుందని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఇది ఒక బలమైన పునాది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.









































