ఏపీకి తుపాను ముప్పు.. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు

Cyclone Threat To AP

ఏపీపై మరోసారి తుపాన్ ముప్పు తప్పదని చెబుతూ వస్తున్న వాతావరణ శాఖ మరోసారి ఆ వార్తలను నిర్ధారణ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలబడి అది తుపానుగా మారే అవకాశం ఉందని దీని వల్ల రాబోయే మూడు రోజులు ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం క్రమంగా బలపడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు ఏదొక సమయానికి అల్పపీడనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతానికి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల అల్పపీడనం మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉందంటున్నారు.

మరోవైపు అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఈరోజుకు తీవ్ర వాయుగుండం మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వాయుగుండం ఎఫెక్ట్ తో తమిళనాడుతో పాటు ఏపీలోని రాయలసీమ ప్రాంతాలపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. దీంతో వాతావరణ శాఖ తమిళనాడులోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసిన ఐఎండీ అధికారులు ఇటు రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఏపీలోని తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బుధవారం ఏపీలోని కర్నూలు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ముందస్తు సూచనలు చేసిన ఏపీ ప్రభుత్వం.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదనిహెచ్చరించింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.