అమరావతి పునర్నిర్మాణానికి డేట్ ఫిక్స్..

అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. అమరావతి రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధపడిన ఏపీ ప్రభుత్వం.. ముహూర్తం సిద్ధం చేసింది. మార్చి 12 నుంచి 15 మధ్య రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి కచ్చితమైన ముహూర్తాన్ని ఎంపిక చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటన చేశారు. దీంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరగనున్నాయని తెలుస్తోంది.అన్ని విధాలా కూడా అమరావతి రాజధానిని అందుబాటులోకి తేవాలన్నది సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక.అందుకే గత అనుభవాల దృష్ట్యా మూడు సంవత్సరాల్లో ఈ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో కదలిక వచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని రాజధానిగా అందరి ఆమోదంతో ఏకాభిప్రాయంతో ఎంపిక చేశారు. రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకువచ్చి..ఐదేళ్లు కాలక్షేపం కబుర్లు చెప్పారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.వైసీపీ హయాంలో రాజధాని లేకుండానే గవర్నమెంటు‌ను నడిపారన్న పేరును మాత్రం గడించారు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిలో రాజధానిని శరవేగంగా పూర్తి చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. మరోవైపు వివిధ సంస్థల ద్వారా పెట్టుబడి సేకరణ కూడా బాగానే జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకూ దాదాపు 40 వేల కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం సమీకరించింది . మరోవైపు వివిధ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. దీంతో ఒకవైపు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం..మరో వైపు ప్రైవేటు సంస్థల భవనాల నిర్మాణం కూడా ప్రారంభం కానున్నాయి. మొత్తంగా 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది.

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ..తమ సొంత శాఖ కంటే రాజధాని నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ.. విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో..ఆ సమయానికల్లా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే రాజధాని నిర్మాణం పూర్తి చేయడం ద్వారా.. ఇలా ఏపీ మరింతగా అభివృద్ధి చెందాలంటే తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న సంకేతాలు వెళ్లినట్లే అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.