తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా భక్తుల సంఖ్య తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మంగళవారం కావడంతో .. ఏపీ, తెలంగాణణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తిరుమలకు భక్తులు చేరుకోలేకపోతున్నారు.
తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా తయారవడం వల్ల రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క విమానంలో తప్ప రైలు, రోడ్డు ప్రయాణాలకు ఆటంకం కలుగుతుండటంతో భక్తులు తిరుమలకు వెళ్లడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో భక్తులు తక్కువ సంఖ్యలోనే తిరుమల కొండపై కనిపిస్తున్నారు.
సోమవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉన్నాకూడా.. తిరుమలకు తిరుపతి చుట్టు పక్కల జిల్లాల నుంచి ఎక్కువ మంది ప్రజలు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ పరిస్థితి మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశముందని దేవస్థానం అధికారులు తెలిపారు.
భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో.. నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతోంది. అయితే సోమవారం భక్తుల సంఖ్య తగ్గినప్పటికీ హుండీ ఆదాయం మాత్రం తగ్గకపోవడం విశేషమని అధికారులు చెబుతున్నారు. సోమవారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి హుండీ ఆదాయం 4.55 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు కూడా ఖాళీగానే కనిపిస్తున్నాయి. భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా.. నేరుగా స్వామి వారి దర్శనం చేసుకునే వీలు కలుగుతోంది. ఉచిత దర్శనం క్యూ లైన్లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు కూడా.. స్వామి వారి దర్శనం ఆరు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు కూడా రెండు గంటల సమయంలోనే దర్శనం పూర్తవుతుంది. ఇక సోమవారం తిరుమల శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో 18,697 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.