ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు చిరు ధాన్యాలను కూడా సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా అమల్లోకి తీసుకురానున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే చిరు ధాన్యాల సరఫరాపై అధికారుల నుంచి వివరాలను సేకరించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులతో నాదెండ్ల మనోహర్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా.. రేషన్ కార్డుదారులందరికి కూడా సబ్సిడీ రేట్లలో పప్పు ధాన్యాలు అందించడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పేద ప్రజలకు అవసరమైన పోషకాహారాన్ని సరసమైన ధరలలో అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు వారి ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలోనే రేషన్ షాపుల ద్వారా చిరు ధాన్యాలు సరఫరా చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. మరోవైపు చిరు ధాన్యాల పంపిణీతో పాటు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలు, హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.