
దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షోకి విజయవాడ వేదికగా మారడంతో అందిర చూపూ అటే పడింది. ఇక మంగళవారం రాత్రి అయితే ఆకాశంలో చుక్కలు కుప్పబోసినట్లు…నక్షత్రాల్లా మిలమిలా డ్రోన్లు మెరిసిపోవడం చూసి అంతా ఆశ్చర్యంగా, ఆసక్తిగా గమనించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే..దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో అదరహో అనే రేంజ్‌లో అదరగొట్టింది.
కృష్ణా తీరంలో పున్నమి ఘాట్‌లో పున్నమి వెలుగులను మించిపోయినట్లు జరిగిన డ్రోన్ హ్యాకథాన్ అందరినీ అబ్బురపరిచింది. ఒకటి కాదు రెండు కాదు..ఒకేసారి 5,500 డ్రోన్లు వెలుగులు విరజిమ్మూతూ ఆకాశంలోకి రకరకాల థీమ్‌లను ఆవిష్కరించాయి. డ్రోన్ల తళుకుబెళుకుల ముందు నక్షత్రాలు చిన్నబోయాయా అన్నట్లు కనిపించడంతో చిన్నారుల నుంచి పెద్దలు వరకూ ఈ షో ఆసాంతం.. ఆసక్తిగా గమనించారు.
అంతేకాదు అమరావతి వేదికగా 5,500 డ్రోన్లతో తొలిసారిగా దేశంలోనే అతిపెద్ద షోను నిర్వహించడంతో.ఈ డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. ఈ డ్రోన్ షో అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధులు.. సీఎం నారా చంద్రబాబు నాయుడికి గిన్నిస్ బుక్ రికార్డు ధ్రువపత్రాలను అందించారు. ఈ డ్రోన్ షో ద్వారా విజయవాడలో ఒకే రోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.
లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి, నదీ తీరాన లార్జెస్ట్ ల్యాండ్ మార్క్, అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి, అతిపెద్ద ఏరియల్ లోగో ఆకృతి, అతిపెద్ద విమానాకృతిలతో సాగినడ్రోన్ షో ఐదు రికార్డులు అందుకున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుఈ భారీ ఈవెంట్ కు హాజరై ఈ కార్యక్రమాన్నిఆద్యంతం ఆసక్తితో తిలకించారు.ఈ షో అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు నగదు బహుమతులను ప్రదానం చేశారు.
మరోవైపు డ్రోన్ షో సందర్భంగా పున్నమి ఘాట్ వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ‘కృష్ణం వందే జగద్గురుం’ కళా ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మొత్తం మీద ఈ డ్రోన్ షో ఏపీ ప్రభుత్వ విజన్ ను చాటేలా, టెక్నాలజీ పట్ల సీఎం ఆసక్తిని వెల్లడించేలా సాగిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.