కూటమి ప్రభుత్వం సీరియస్ యాక్షన్లోకి దిగింది. గతంలో నోటికి, చేతికి అడ్డు అదుపు లేకుండా దూకుడుగా వ్యవహరించిన నేతలకు తగిన గుణపాఠం చెప్పడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ లిస్టులో పేర్నినాని పేరు వినిపిస్తోంది. ఎందుకంటే వైసీపీలో లాజిక్లు బాగా మాట్లాడిన నేతల్లో పేర్ని నాని ముందుంటారు.అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా తన మాటల వేడితో ప్రత్యర్థులను టార్గెట్ చేసేవారు.
మొన్నటి వరకు ఆయనే చాలాసార్ల కూటమి ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధిస్తూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు.అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే పరారీలో ఉన్నారా అన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఎప్పుడయితే డిప్యూటీ సీఎం పవన్ కాకినాడ తీరానికి వెళ్లి పట్టుబడిన బియ్యం పరిశీలించారో అప్పుడే పేర్ని నానికి చెమట్లు పోశాయన్న వాదన వినిపిస్తోంది.
అయితే ఆ షిప్ వరకు మాత్రమే పవన్ ఎందుకు వెళ్లారని మీడియా ముందు అప్పుడు ప్రశ్నించిన.. దానికి కూతవేటు దూరంలో ఉన్న షిప్ లో భారీగా బియ్యం నిల్వలు ఉన్నాయి కదా అని గుర్తు చేశారు. ఆ బియ్యం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందినవంటూ కొత్త కహానీ తెరమీదకు తీసుకువచ్చారు. అయితే ఆ తర్వాత ఏమయిందో కానీ అప్పటినుంచి పేర్ని నాని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
కనీసం బయట ఎక్కడా కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే పేర్నినాని కుటుంబ సభ్యులతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 13 న వైసీపీ రాష్ట్రస్థాయి ఉద్యమానికి పిలుపునివ్వగా.. ఆ నిరసన కార్యక్రమాల్లో కూడా పేర్ని నాని ఎక్కడా కనిపించలేదు.దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
నిజానికి కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా రేషన్ బియ్యం మాఫియా సంచలనం సృష్టిస్తోంది. దీనిపైన కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ సమయంలోనే పేర్ని నాని పేరు బయటకు వచ్చింది. నాని సతీమణి జయసుధ పేరుతో మచిలీపట్నంలో కొన్ని గోదాములు ఉన్నాయి. వీటిని పౌర సరఫరాల శాఖ లీజుకు తీసుకుని.. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సరఫరా చేస్తుంది.
ఆ బియ్యాన్ని ఈ గోదాములలో ఉంచగా.. అయితే ఉన్నట్టుండి గోదాముల్లో భారీగా బియ్యం నిల్వలు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం నిల్వ ఉంచిన బియ్యంలో ఏకంగా 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.దీనివల్లే ఇప్పుడు కుటుంబంతో సహా పేర్ని నాని పరారీ అయినట్లు ప్రచారం నడుస్తోంది.
అధికారంలో ఉండగా ఇష్టానుసారంగా నోరు పారేసుకునే పేర్ని నానిని ఇప్పుడు అవినీతిలోనూ చేతివాటం చూపించాడని తెలియడంతో..ఇక అతనిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని.. కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో తన అరెస్టు ఉంటుందని భయపడిన పేర్ని నాని కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
పేర్నినానికి కృష్ణాజిల్లాలోని కొంతమంది అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో నియమితులైన కొంతమంది అధికారులు అతగాడికి సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో ఎవరీ అధికారులు అన్న యాంగిల్ లోనూ పోలీసులు దర్యాప్తు కూపీ లాగుతున్నారు.