తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రసిద్ది చెందిన దేవాలయం అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. తిరుపతి నగరంలో టీటీడీ పరిపాలనా భవనం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో కార్యాలయం కూడా ఉంది. తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం కార్యాలయానికి భారీ బందోబస్తు కూడా ఉంది. శనివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. భవనంలోని రెండవ అంతస్తులో బైపాస్ రోడ్ల విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ కార్యాలయంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది గదికి వెలుపల గడియపెట్టి భోజనానికి వెళ్లారు. మంటలతో పొగలు రావడం చూసి భద్రతా సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సాధనాలతో మంటలు ఆర్పేందుకు యత్నించారు. అయినా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు.
కార్యాలయంలో దేవుడి పటం వద్ద వుంచిన దీపం ప్రమాదవశాత్తూ కింద పడడంతో దస్త్రాలు కాలిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని ఫైల్స్ ఖాళి దగ్ధమయ్యాయని సమాచారం. టీటీడీ పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన ఫైల్ ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ఇక ప్రమాదంలో దస్త్రాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని సీవీఎన్ఎస్‌ఓ శ్రీధర్ తెలిపారు. అన్ని దస్త్రాలను ఈ ఫైలింగ్ చేసి సేవ్ చేసినట్లు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంలో రోడ్లు, టీటీడీ ఆలయాలకు సంబంధించిన దస్త్రాలు కాలిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనపై అధికారులు కూడా విచారణ చేపట్టారు. టీటీడీ పరిపాలనా భవనంలో పాక్షికంగా దగ్దం అయిన ఫైల్స్ ఎప్పటికి, ఎప్పటి నుంచి ఆ ఫైలింగ్ జరుగుతోంది, ఏఏ ఆలయాలకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి అని ఆరా తీస్తున్నారు.
సుమారు 25 ఫైల్స్ దగ్దం అయ్యాయని, ఆ పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, త్వరలో పూర్తి సమాచారం అందిస్తామని జిల్లా ఎస్సీ సుబ్బారాయుడు అన్నారు. సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం వద్గ ఫైళ్ల దగ్ధం ఘటన కూడా శనివారం కలకలం రేపింది. ఈ ఘటనలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయాయి. అయితే కార్యాలయంలోని అధికారులే ఈ ఫైళ్లను కాల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం కాలిపోయిన ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ఘటనలో కాలిపోయినవి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించిన పరిహారానికి సంబంధించిన ఫైళ్లుగా తెలుస్తోంది.