ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ..వైసీపీ నుంచి పార్టీ మారేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. జగన్ కోసమే తాము అన్నట్లు ప్రవర్తించినవాళ్లంతా.. అధికారం పోయాక బయటకు వెళ్లిపోయారు. చివరకు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి అయితే ఏకంగా రాజీనామా చేసి రాజకీయాలకే దూరమయ్యారు. తాజాగా ఒంగోలు జిల్లాకు చెందిన 20 మంది కార్పొరేటర్లు గుడ్ బై చెప్పి.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు అదే ప్రకాశం జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత జనసేనలో చేరడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి సిద్దా రాఘవరావు జనసేన పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన రాఘవరావు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నేతగా గుర్తింపు పొందారు. 2014లో దర్శి టీడీపీ టికెట్ దక్కించుకున్న రాఘవరావు.. ఎమ్మెల్యేగా గెలవడంతో చంద్రబాబు తన కేబినెట్లోకి తీసుకున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన సిద్ధా రాఘవరావుకు సామాజిక సమీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి టికెట్ బదులు ఒంగోలు పార్లమెంట్ సీటు కేటాయించినా.. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తరువాత వైసీపీలో జాయిన్ అయిన ఆయన.. 2024 ఎన్నికల్లో దర్శి టిక్కెట్ కోరినా..వైఎస్ జగన్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సీటు ఇచ్చారు. అప్పటి నుంచి మనస్థాపంతో ఉన్న రాఘవరావు .. తాజాగా జనసేనలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీతో మంచి అనుబంధమున్న రాఘవరావు.. ఆ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారని.. ఒకటి రెండు సార్లు చంద్రబాబును కూడా కలిశారని వార్తలు వినిపించాయి. కానీ చంద్రబాబు నుంచి అంతగా సానుకూలత రాకపోవడంతో.. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని.. జనసేనలో చేర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే సిద్దా రాఘవరావు చేరికపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.