ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనాపరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎన్నికలవేళ ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మాట ఇచ్చినట్లుగానే పెన్షన్‌ను పెంచి ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఎప్పుడు నెరవేరుస్తారా? అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా ఆ హామీని నెరవేర్చేందుకు వడివడిగా అడుగులేస్తోంది.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమల్లో ఉన్న రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఏపీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ప్రభుత్వంపై ఎంత మేర భారం పడుతుందనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ పథకం అమలుకు కూడా ఎన్నో రోజులు పట్టదని వీలైనంత త్వరగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈక్రమంలో ఏపీ రాష్ట్ర రవాణా, యువజన క్రీడల మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు. విశాఖపట్నం నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ పథకం అమలుకు సంబంధించి కర్ణాటక, తెలంగాణలో ఏపీ ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలోకి విలీనం చేయలేదన్నారు. త్వరలోనే తాము ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు.. ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ