ఏపీలో దీపం 2 కింద రెండో విడతగా.. ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 1 వరకు ఉచితంగా అందించే రెండో సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని కూటమి ప్రభుత్వం సూచిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. ఏపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఒకటి చొప్పున.. ఏడాదికి మూడు ఫ్రీ సిలిండర్లను ఇస్తుంది. లబ్ధిదారులు తొలిసారి విడతలో.. నగదు చెల్లించి సిలిండర్ తీసుకున్న 48 గంటల్లోనే.. వారి బ్యాంకు ఖాతాలో గ్యాస్ సిలిండర్ డబ్బులను జమ చేసింది . ఇప్పుడు రెండో విడతకు సంబంధించి గ్యాస్ సిలిండర్ విషయంలోనూ ఇదే చేస్తోంది.
చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడానికి నిర్ణయించిన కూటమి ప్రభుత్వం.. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి ఈ నిర్ణయం ఉంది. గతంలో చంద్రబాబు దీపం పథకాన్ని ప్రవేశపెట్టగా.. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఈ పథకానికి దీపం 2 అనే పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. గత ఏడాది దీపావళికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి.. తొలి సిలిండర్ అప్పుడే అందించి..తాజాగా రెండో సిలిండర్ అందిస్తోంది. ఈ ఏడాది చివర్లో మరో సిలిండర్ అందించనుంది.
ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా ఏడాదికి ఓ కుటుంబానికి 10 నుంచి 12 గ్యాస్ సిలిండర్లు అవసరం ఉంటుంది. వాటిలో మూడు సిలిండర్లు ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర సుమారు 900 రూపాయల వరకు ఉంది. ఏడాదికి మూడు సిలిండర్లంటే దాదాపు రూ.2700 వరకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇవ్వడంతో.. ఈ పథకంపై ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది.