మాజీ హోం మంత్రి సుచరిత కొద్ది రోజులుగా వైసీపీని వీడుతున్నారనే ప్రచారం ఉంది. నిజానికి ఎన్నికల సమయంలోనే పార్టీ మార్పుపై ప్రచారం మొదలైంది. తాజా ఎన్నికల్లో సుచరిత తన సొంత నియోజకవర్గం అయిన ప్రత్తిపాడు కాదని, తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జగన్ గుంటూరు వచ్చినా, తర్వాత జరిగిన ఏ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనలేదు. తాజాగా జగన్ తో సమావేశమైన సుచరిత రాజకీయాలకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడారు. తాజాగా ఇదే బాటలో సుచరిత నడిచారు. ఈ ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసిన మాజీ హోం మంత్రి సుచరిత.. మాజీ సీఎం జగన్ తో భేటీ అయి తన అనారోగ్య కారణాలతో రాజకీయాల్లో కొనసాగలేనని వెల్లడించారు.అయితే కొంత కాలం ఆగి నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించగా..తన వ్యక్తిగత సమస్యలను సుచరిత వివరించారు. తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని..కేవలం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు. తాడికొండలో తన స్థానంలో మరొకరికి తన బాధ్యతలును అప్పగించాలని ఆమె సూచించారు.
మేకతోటి సుచరిత 2009 లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 లో జగన్ కోసం రాజీనామా చేసి అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. కానీ 2014లో ఓడిపోయారు. కాగా, 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో జగన్ మోహన్ రెడ్డి..సుచరితకు హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ ప్రక్షాళన వేళ సుచరిత తన పదవి కోల్పోయారు. ఆ సమయంలోనే కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక, 2024 ఎన్నికల సమయంలో.. సుచరిత ప్రత్తిపాడు కాదని… తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సుచరిత అభ్యర్ధనతో సీటు కేటాయించినా కూడా ఆమె అక్కడ ఓడిపోయారు.
ఎన్నికల ఫలితాల తరువాత నుంచి సుచరిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ తాజాగా రెండు సార్లు గుంటూరుకు వచ్చినా కూడా సుచరిత మాత్రం దూరంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలోనే సుచరిత పార్టీ మార్పు గురించి పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రత్తిపాడు, తాడికొండలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సుచరిత జనసేన వైపు చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే,ఇప్పుడు తాను రాజకీయాల్లోనే ఉండాలని అనుకోవటం లేదని ,రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ఆమె వెల్లడించారు.