ఏపీలో మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగకు ముందే మందు షాపులు అందుబాటులోకి వస్తాయని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా ఏపీని దోపిడీ చేసిందని.. అందుకే తాము ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు.
ఒకటి, రెండు రోజుల్లో షాపుల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఇస్తామని మంత్రి వివరించారు. ఏ జిల్లాలో ఎన్ని షాపులు అనే వివరాలను తెలియజేస్తామని చెప్పారు. 7 రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవచ్చన్న మంత్రి కొల్లు రవీంద్ర.. మధ్యలో 2 రోజులు సెలవులు వస్తున్నాయి కాబట్టి పదో రోజున డ్రా తీస్తామని తెలిపారు.
ఒక దరఖాస్తు ఫీజు 2 లక్షల రూపాయలుగా ఉంటుందని…. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు ఎన్నైనా వేయవచ్చని మంత్రి అన్నారు. డ్రాలో పేర్లు వచ్చిన వారికి లైసెన్స్ ఫీజులు 4 స్లాబుల రకాలుగా ఉన్నాయని చెప్పారు. అంతేకాదు స్లాబులు ఏరియా బట్టి నిర్ణయం ఉంటుందని.. ఇవి 6 వాయిదాలలో కట్టుకోవాలని కొల్లు రవీంద్ర అన్నారు. అన్ని బ్రాండ్లను అందరికీ అందే విధంగా పారదర్శకంగా అందిస్తున్నామని చెప్పారు.
99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని సామాన్యులకు కూటమి ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్‌మెంట్ వాళ్లను సెబ్ పేరుతో విడగొట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు రెండింటినీ కలుపుతూ తాము నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటు సీనరేజ్ చార్జి కట్టి.. లోడింగ్, అన్ లోడింగ్ కడితే పట్టా ల్యాండ్‌లో సాండ్ తీసుకోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.