నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా సమీపం నుంచి ఉత్తర దిశగా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకబోతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల పాటు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచలున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది.
అల్పపీడన ప్రభావంతో డిసెంబర్19న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు , విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు ,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే డిసెంబర్ 20న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీరప్రాంతం ఇప్పటికే అల్లకల్లోలంగా మారింది. కెరటాల ఉద్ఢృతికి కోనపాపేటలో 15 ఇళ్ళు నేలమట్టం అయ్యాయి.
కొత్తపల్లి మండలంలో తీర ప్రాంతాలైన ఉప్పాడ, అమీనాబాద్ గ్రామాల్లో ఇల్లు కోతకు గురవుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో సముద్ర అలల తాకిడికి ఏటా తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న గృహాలు నేలమట్టం అవుతూనే ఉంటాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.