హెల్లో ఏపీ..బైబై వైసీపీ అని అసెంబ్లీ ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన స్లోగన్..ఇప్పుడు నిజంగా మారబోతోంది. ఐదేళ్ల జగన్ పరిపాలన నచ్చక ప్రజలు వైసీపీకి బైబై చెబితే..ఇప్పుడు వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలు కూడా వైసీపీకి బైబై చెప్పేస్తుండటం ఏపీ రాజకీయాలలో హీటు పుట్టిస్తోంది.
ఇన్నాళ్లూ రాజ్యసభలో తమకు 11 మంది ఎంపీల బలం ఉందని.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి తమ అవసరం ఉందని చెప్పుకుంటున్న వైసీపీ నేతలకు ఇప్పుడు భారీ షాక్ తగలబోతోంది. రాజ్యసభలో వైఎస్సాసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఎంపీల్లో 10 మంది కూటమి పార్టీల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు.
వీరిలో ముగ్గురు టీడీపీలోకి , ఐదుగురు బీజేపీలోకి , ఇద్దరు జనసేన పార్టీలోకి వెళ్లబోతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఇప్పటికే వీరంతా కూటమి పార్టీల నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు త్వరలో టీడీపీ గూటికి చేరబోతున్నారు. ఈరోజు ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ పదవులకు, పార్టీ సభ్యత్వానికి ఒకేసారి వీరిద్దరూ రాజీనామా లేఖలు ఇవ్వనున్నారు.
వీరి బాటలోనే మరో ఎనిమిది మంది వైసీపీ రాజ్యసభ్యులు బైబై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.దీంతో కేవలం ఒక్క రాజ్యసభ ఎంపీ మాత్రమే వైసీపీకి మిగలనున్నారు. టీడీపీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నవారిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతోపాటు గొల్ల బాబూరావు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీలో చేరడానికి రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని సిద్ధమవుతున్నారు.
ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్. కృష్ణయ్య జనసేన పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని ఏపీ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అంతే కాదు జగన్ కు పెద్ద ఝలక్ ఇవ్వడానికి అటు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలలో ఒకరు బీజేపీలోకి జంప్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, తాను వైసీపీని వీడటం లేదని విజయసాయి ఎక్స్ వేదికగా ప్రకటించినా.. బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన వైసీపీని వీడడం గ్యారంటీ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజ్యసభ సభ్యుల్లో వైవీ సుబ్బారెడ్డి ఒక్కరే వైసీపీలో కొనసాగినా కూడా..ఆయన పదవీకాలం ముగిసాక రాజ్యసభలో వైసీపీ ప్రాతినిధ్యమే కోల్పోనుంది. రాజ్యసభలోనేకాదు.. అటు శాసన మండలిలోనూ వైసీపీని వీడటానికి ఆ పార్టీ ఎమ్మెల్సీలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పోతుల సునీత తన రాజీనామాతో బోణీ చేయగా..ఆమె బాటలోనే మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
ఇక వైసీపీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. జగన్ మోహన్ రెడ్డితో కలుపుకొని 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారనీ, టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే కాలంలో వైసీపీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అవ్వటం గ్యారంటీ అంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.