ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అక్కడ కూటమి అభ్యర్థిని ఓడించేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందరినీ పక్కకు పెట్టి.. ఉత్తరాంధ్రలో దమ్మున్న నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దింపారు. వాస్తవానికి విశాఖ ఎమ్మెల్సీ పదవి కోసం వైసీపీలో పెద్ద ఎత్తున నేతలు పోటీ పడ్డారు. ఆ టికెట్ తనకే దక్కుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ అందరినీ జగన్ సైడ్ చేసేశారు. ఆ పదవి దక్కించుకోవాలంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావించిన జగన్.. బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు.
నిజానికి ముందు నుంచి కూడా బొత్సకు జగన్ అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా బొత్సకు ప్రాధాన్యత ఇస్తూ.. నాలుగు టికెట్లను కేటాయించారు. బడాలీడర్లను సైతం పక్కకు పెట్టిన జగన్.. బొత్సకు ఆయన అనుచరులకు కలిపి నాలుగు టికెట్లు ఇచ్చారు. అయితే ఎన్నికల్లో వారంతా ఓటమిపాలయ్యారు. ఒక్కరు కూడా గెలవలేదు. అయినప్పటికీ జగన్ వద్ద బొత్సకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గలేదు. అందుకే విశాఖ ఎమ్మెల్సీ టికెట్‌ను జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకు కేటాయించారు. ఒక్క టికెట్ కేటాయించడమే కాకుండా బొత్సకు జగన్ భారీ ఆఫర్లను కురిపించారట. ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గెలిస్తే ఆయన దశ తిరిగిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి చూస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గెలిస్తే.. సుబ్బారెడ్డి బాధ్యతలను బొత్సకు అప్పగించే అవకాశం ఉందని పార్గీ వర్గాలు అంటున్నాయి. వైవీ సుబ్బారెడ్డిపై నాన్ లోకల్ ముంద్ర ఉంది. అలాగే స్థానిక రాజకీయాలను అవగాహన చేసుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సుబ్బారెడ్డికి ఇటీవల వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యతలను అప్పగించారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలను బొత్స సత్యనారాయణకు అప్పగించడమే కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. త్వరలోనే ఆయన బుజాలపై ఆ బాధ్యతలను పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అంతేకాకుండా బొత్స ఎమ్మెల్సీగా గెలిస్తే శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పిస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారట. ప్రతిపక్ష నాయకుడి హోదా అంటే మామూలు విషయం కాదు. కేబినెట్ ర్యాంక్‌తో కూడిన హోదా అది. ఆ పదవి దక్కితే తిరిగి బొత్స సత్యనారాయణ మంత్రి పదవితో సమానమైన స్థాయిలో ఉంటారు. మొత్తంగా చూసుకుంటే ఎమ్మెల్సీగా గెలిస్తే మాత్రం బొత్స సత్యనారాయణ ప్రాధాన్యత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి విశాఖలో బొత్స గెలుస్తారా? లేదా? అన్నది.